ఎయిర్ పోర్టులో.. రూ. 25 కోట్ల బంగారం పట్టివేత

ఎయిర్ పోర్టులో.. రూ. 25 కోట్ల బంగారం పట్టివేత

సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. 48.20 కిలోల గోల్డ్ పేస్ట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో అతిపెద్ద సీజ్‌లలో ఒకటైన ఈ బంగారం విలువ రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో షార్జా నుంచి ప్రయాణిస్తున్న ఓ అధికారితో పాటు ముగ్గురు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  

జూలై 7న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నంబర్ IX172 ద్వారా షార్జా నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులు భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసేందుకు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు. వారి బ్యాగేజీలో నుంచి ఐదు బ్లాక్‌బెల్ట్‌లలో దాచిన 20 వైట్ కలర్ ప్యాకెట్లలో పేస్ట్ రూపంలో ఉన్న 43.5 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

అధికారుల స్క్రీనింగ్, పరీక్షలను తప్పించుకోవడానికి ఇమ్మిగ్రేషన్‌కు ముందు నిందితులు ఆ బంగారం పేస్ట్ ను వాష్ రూమ్ లో ఎక్స్ ఛేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు DRI తెలిపింది. ఆ తర్వాత విషయం అధికారులకు చేరడంతో వారు 4.67 కిలోల బంగారాన్ని ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ ప్రక్కనే ఉన్న పురుషుల వాష్‌రూమ్‌లో వదిలివేసినట్టు కనుగొన్నారు.

ప్రయాణీకుల నుంచి రికవరీ చేయబడిన మొత్తం 48.20 కిలోల బంగారు పేస్ట్ విలువ రూ.25.26 కోట్ల విలువైందని, అందులో 42 కిలోల బంగారం (స్వచ్ఛత 99%) రికవరీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు ప్రయాణికులతో పాటు ఒక అధికారిని అరెస్టు చేసినట్లు చెప్పారు.