గుజరాతీలు చరిత్ర సృష్టించారు: నరేంద్ర మోడీ

గుజరాతీలు చరిత్ర సృష్టించారు: నరేంద్ర మోడీ
  • ఒక శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో హిమాచల్​లో ఓడిపోయాం
  • అయినా అభివృద్ధికి సహకరిస్తాం: నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: గుజరాత్ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని మళ్లీ ప్రూవ్ అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎంతో నమ్మకం, విశ్వాసంతో మళ్లీ అధికారాన్ని అప్పచెప్పారని తెలిపారు. గుజరాత్​లో బీజేపీ కమాల్​ చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్​​లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ‘‘ఈసారి గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ రికార్డు బ్రేక్ చేయాలని క్యాంపెయిన్​కు వచ్చినప్పుడు సీఎం భూపేంద్ర పటేల్ ను కోరాను.

గుజరాత్​ ప్రజలు అదే చేసి చూపించారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. అందరికీ ధన్యవాదాలు. ఏదిఏమైనా ఈసారి గుజరాత్ కమాల్ చేసింది”అని మోడీ అన్నారు. అలాగే, భూపేంద్ర పటేల్​పై మోడీ ప్రశంసలు కురిపించారు. ‘‘సీఎం భూపేంద్ర పటేల్.. ఘట్లోడియా సెగ్మెంట్ నుంచి 1.9 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు. ఇది అసాధారణ విజయం”అని మోడీ కొనియాడారు. 

కష్టానికి ఫలితం దొరికింది

బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం దొరికిందని మోడీ అన్నారు. ఉత్తర్​ప్రదేశ్, బీహార్​ బై ఎలక్షన్స్​లోనూ బీజేపీ సత్తా చాటిందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వ ప్రయోజనాల కోసం దేశానికి కొత్త సవాళ్లు విసురుతున్నారని, ఆ పార్టీలను ప్రజలందరూ గమనిస్తూనే.. అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘‘కొన్ని పార్టీలు ప్రజలను విభజించి.. దోచుకునేందుకే ట్రై చేస్తున్నాయి.

కానీ, మనందరినీ కలిపేది మాతృభూమి ఒక్కటే. మాతృభూమి ప్రయోజనం కోసమే బీజేపీ పని చేస్తుంది. దేశంలోని చాలా మంది ఫస్ట్​ ఛాయిస్ బీజేపీ అయ్యింది”అని ఏ పార్టీ పేరు ప్రస్తావించకుండా మోడీ అన్నారు. ఫేక్ న్యూస్​తో జాగ్రత్తగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ‘‘నేను టార్గెట్ అవుతున్నాను.. మీరు కూడా టార్గెట్ అవుతారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఓపికతో సిద్ధంగా ఉండాలి”అని మోడీ తెలిపారు.

అందరూ బీజేపీ వైపే చూస్తున్నరు..

సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ధైర్యం బీజేపీకి మాత్రమే ఉందని, అందుకే ప్రజలు బీజేపీ వెంట నడుస్తున్నారని మోడీ అన్నారు. ‘‘1 శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో మేం హిమాచల్ ప్రదేశ్ లో గెలిచే చాన్స్​ కోల్పోయాం. బీజేపీని గెలిపించేందుకు ప్రజలు ఎంతో ప్రయత్నించారని దీన్నిబట్టి తెలిసింది. ఫలితం ఎలా ఉన్నా సరే.. కేంద్ర సర్కారు నుంచి హిమాచల్ అభివృద్ధికి కృషి చేస్తం’’ అని మోడీ భరోసా ఇచ్చారు.

ఒక్క పోలింగ్‌ సెంటర్​లోనూ రీపోలింగ్‌ జరపాల్సిన అవసరం రాకుండా సమర్థవంతంగా తన విధులు నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​తో కలిసి మోడీ విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు.