RR vs GT: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించిన రషీద్ ఖాన్

RR vs GT: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించిన రషీద్ ఖాన్

ఐపీఎల్ లో మరో మ్యాచ్ అభిమానులను థ్రిల్లింగ్ కు గురి చేసింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి గెలిచి ఔరా అనిపించింది. గిల్(44 బంతుల్లో 72, 6 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుత పోరాటానికి తోడు చివర్లో రషీద్ ఖాన్(24), టివాటియా (22) మెరుపులతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసి విజయం సాధించింది. 

భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (35) శుభమాన్ గిల్ ఆచితూచి ఆడుతూ తొలి వికెట్ కు 64 పరుగులు జోడించారు. అయితే 13 పరుగుల వ్యవధిలో సాయి సుదర్శన్ తో పాటు వెడ్(4), అభినవ్ మనోహర్(1) అవుట్ కావడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్న మరో వైపు గిల్ పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. గిల్ ఔటైన తర్వాత మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గినా.. చివర్లో రషీద్ ఖాన్, టివాటియా మెరుపులు మెరిపించి జట్టుకు విజయాన్ని అందించారు.             
 
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పరాగ్, కెప్టెన్ సంజు శాంసన్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పరాగ్ 3 ఫోర్లు, 5 సిక్సులతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.  శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.