కర్నాటకలో అమూల్ దుమారం

కర్నాటకలో అమూల్ దుమారం
  • కర్నాటకలో అమూల్ దుమారం
  • బెంగళూరులోకి ఎంటరవుతున్నట్లు కంపెనీ ట్వీట్..
  • ప్రతిపక్షాల మండిపాటు
  • నందిని బ్రాండ్ ను దెబ్బతీసేందుకు కుట్ర అన్న సిద్ధరామయ్య
  • నందిని బ్రాండే దేశంలో నెంబర్ 1గా ఉంటుందన్న బొమ్మై

బెంగళూరు : గుజరాత్ కు చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ చేసిన ట్వీట్ కర్నాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. బెంగళూరు మార్కెట్ లోకి ఎంటరవుతున్నామని, తమ ఉత్పత్తులను ఆన్ లైన్ డెలివరీ చేస్తామంటూ ఆ సంస్థ ప్రకటించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కర్నాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే  ‘నందిని’ డెయిరీని దెబ్బతీసేందుకు కుట్రపన్నారని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆరోపించారు. కర్నాటక మిల్క్ ఫెడరేషన్  (కేఎంఎఫ్)ను అమూల్ లో విలీనం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కర్నాటకలోకి అమూల్ ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్న అంశంపై రెఫరెండం నిర్వహించాలని కేంద్ర హోం మంత్రి, కోఆపరేషన్  మంత్రి అమిత్ షాకు వారు సవాల్ విసిరారు.

అమూల్ ఉత్పత్తులను కొనబోమని కన్నడిగులందరూ ప్రతిజ్ఞ చేయాలని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆదివారం పిలుపునిచ్చారు.  అమూల్ ను అక్రమ మార్గాల్లో రాష్ట్రంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గుజరాత్ కు చెందిన అమూల్ కన్నా నందిని బెటర్ బ్రాండ్ అని, బయటి బ్రాండ్ తమ రాష్ట్రానికి అవసరం లేదని కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్  అన్నారు. నందిని బ్రాండ్ ను కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని జేడీఎస్ కూడా ఆరోపించింది. మరోవైపు కర్నాటక డెయిరీ రైతులకు మద్దతు తెలిపేందుకు నందిని పాలు మాత్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్రంలోని హోటళ్ల సంఘం నిర్ణయించింది. అలాగే సోషల్ మీడియాలో ‘గోబ్యాక్ అమూల్’, ‘సేవ్ నందిని’ పేరుతో హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. అయితే, అమూల్ పై రాజకీయాలు సరికాదని సీఎం బొమ్మై అన్నారు. నందిని బ్రాండే దేశంలో నంబర్ వన్ గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.