గల్ఫ్​ కార్మికులు గోస పడ్తున్నరు

గల్ఫ్​ కార్మికులు గోస పడ్తున్నరు

ఫారిన్​ మినిస్ట్రీ లెక్కల ప్రకారం మనదేశానికి చెందిన 89 లక్షల మంది వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ మంది. కరోనా మహమ్మారి విజృంభించడంతో వీరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఏడాదికిపైగా వీరంతా అక్కడే చిక్కుకుపోవడంతో వారి బాగోగుల గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. క్రూడాయిల్​ ధరల్లో తగ్గుదల, ఆర్థిక సంక్షోభంతోపాటు కరోనా ప్రభావం వంటివన్నీ చుట్టుముట్టడంతో గల్ఫ్ కంపెనీలన్నీ ఆర్థికంగా బాగా దెబ్బతీన్నాయి. 

చేసేందుకు పని లేదు.. తినేందుకు తిండి లేదు
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికులందరూ చిన్న, మధ్యతరగతి వారే. వీరందరూ నిర్మాణ, రిటైల్ రంగాలు, డ్రైవర్లుగా, వివిధ ఉత్పత్తి కంపెనీల్లో కాంట్రాక్ట్ లేబర్​గా పనిచేస్తున్నారు. వీరితోపాటు రోజువారీ కూలీలుగా ఎంతో మంది పనిచేస్తున్నారు. వీరు అందుకునే జీతాలు చాలా తక్కువే. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గిపోవడం.. కంపెనీలు మూతపడటంతో చేసేందుకు పని లేక, జీతాలు రాక వీరంతా తిప్పలు పడుతున్నారు. కనీసం తినడానికి రెండు పూటలా తిండి కూడా లేక కొన్ని రోజులుగా కాలే కడుపులతో కాలం గడుపుతున్నారు. గల్ఫ్​ దేశాల్లో ఫిజికల్​ డిస్టెన్స్​ నిబంధన స్ట్రిక్ట్​గా అమలు చేస్తున్నారు. ఫిజికల్​ డిస్టెన్స్​కు సంబంధించి అక్కడ ఆంక్షలు తీవ్రంగా ఉన్నాయి. అయితే ప్రవాస కార్మికులు ఉండేది చిన్న చిన్న గదుల్లోనే. వాటిలోనే పది నుంచి పదిహేను మంది కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం ఫిజికల్​ డిస్టెన్స్​ రూల్​ వీరికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయ్యింది. ఫలితంగా వీరిపై ఆంక్షల ఉల్లంఘన కేసులు కూడా నమోదవుతున్నాయి.

కార్మికులను పట్టించుకునే వారే లేరు
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టూరిస్ట్ వీసా మీద గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. అలాగే ఇమిగ్రేషన్ పత్రాలు, పాస్​పోర్టు లేనివారు, వీసా గడువు ముగిసిన వారు, గల్ఫ్ దేశాల నివాస చట్టాలను ఉల్లంఘించినవారు, అక్రమ నివాసితులుగా ఉన్న వారు లక్షలాది మంది ఉన్నారు. కరోనా ప్రభావంతో వారి ఆరోగ్య సంరక్షణ పెద్ద సమస్యగా మారింది. వీరు అనారోగ్యానికి గురైతే పట్టించుకునే నాథుడే ఉండడు. గల్ఫ్ దేశాల్లో మన కార్మికులు నివసించే ప్రాంతాల్లోని కొన్ని ఇండియన్​ స్కూళ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. కువైట్, ఒమెన్ దేశాల్లో అక్రమంగా ఉంటున్న వలస కార్మికులను వెంటనే వారి దేశాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారు స్వదేశం రావడం కష్టమైన పని.

పీబీబీవై స్కీమ్ ఉన్నా వర్తించట్లే
పని కోసం విదేశాలకు వలస వెళ్లే ఇండియన్ల కోసం ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) పథకం ఉంది. అయితే, ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్(ఈసీఆర్) కేటగిరీ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. టెన్త్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారే ఈసీఆర్​ కాని పాస్‌‌పోర్ట్‌‌లకు అర్హులు. పీబీబీవై స్కీమ్​ను 2003లో ప్రారంభించారు. అయితే 2006, 2008, 2017లో ఈ స్కీమ్​కు పలు సవరణలు చేశారు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా రూ.10 లక్షల బీమా రక్షణను అందిస్తుంది. అయితే కరోనా వల్ల సంభవించే మరణాలు ఈ స్కీమ్​ పరిధిలోకి రావు. పీబీబీవై స్కీమ్​ను మరోసారి సవరిస్తే ఈసీఆర్ / ఇసీఎన్ఆర్ కేటగిరీతో సంబంధం లేకుండా విదేశాల్లో ఉన్న మన వలస కార్మికులందరికీ ఈ స్కీమ్​ వర్తిస్తుంది. అలాగే పథకంలో కరోనా కేసులను కూడా కవర్ చేయాలి. గల్ఫ్​ దేశాల్లో పని చేస్తున్న ప్రవాస కార్మికుల్లో ఇప్పటి వరకూ సుమారు 1,898 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. పీబీబీవై స్కీమ్​ వర్తించినట్లయితే వారి కుటుంబాలకు అండ దొరికేది. కేరళ ప్రభుత్వం ప్రవాస కార్మికుల కోసం పలు సంక్షేమ కార్యక్రమలు చేపడుతోంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేరళ విధానాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. ప్రవాస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

ఎంఆర్​డబ్యూలో మార్పులతోనూ ఇబ్బందులు
మినిమం రిఫరల్ వేజ్(ఎంఆర్‌‌డబ్ల్యూ) తగ్గింపు గురించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌‌ ప్రవాస కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఖతర్, బహ్రెయిన్, ఒమన్, యూఏఈ వంటి దేశాల్లో కొత్త ప్రవాస కార్మికులకు ఎంఆర్​డబ్ల్యూను తగ్గించింది. ఎంఆర్​డబ్ల్యూ తగ్గింపు పేదరికాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ఆరోగ్యం, విద్య వంటి అవసరమైన సేవలకు ప్రాముఖ్యతను తగ్గిస్తుంది. వాస్తవానికి కార్మికుల వేతనాలను నియంత్రించడానికి, ఆమోదయోగ్యం కాని వేతనాలతో వారు దోపిడీకి గురికాకుండా ఎంఆర్‌‌డబ్ల్యూ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. అయితే 2020 సెప్టెంబర్ లో కనీస రిఫరల్ వేతనాలను తగ్గించడం లక్షలాది మంది కార్మికులపై ప్రత్యక్షంగా ప్రభావితం చూపనుంది. దీనిని సవరించి వలస కార్మికులకు మెరుగైన ఎంఆర్​డబ్ల్యూ ఉండేలా చూడాలి. అంతర్జాతీయ కార్మిక సంస్థ సూచనల ప్రకారం.. నిర్మాణాత్మక సంస్కరణలు, సాంకేతిక మార్పులు, జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో వైవిధ్యం ఎంతో అవసరం. ఆ దిశగా ప్రభుత్వాలు ముందుకు సాగాలి. గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్య పరిచే దశలో ఉన్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ రికవరీ చర్యలు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఇండియా లాంటి దేశాలు ఈ మార్పులను నిరంతరం పర్యవేక్షించాలి. దానికి అనుగుణంగా మన దేశంలో అవసరమైన మార్పులు తేవాలి.

- డాక్టర్ త్రిలోక్ చందన్ గౌడ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ