- రైతు దగ్గర లంచం డిమాండ్ చేసిన గుండుమాల్ తహసీల్దార్
- భూమి రిజిస్ట్రేషన్పేపర్లు ఇవ్వకుండా సతాయింపు
- రైడ్చేసి పట్టుకున్న ఏసీబీ
కోస్గి, వెలుగు : భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ నారాయణపేట జిల్లా గుండుమాల్ తహసీల్దార్ నేనావత్ పాండునాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్సీ బి.కృష్ణగౌడ్ కథనం ప్రకారం..గుండుమాల్ మండలం భోగారం గ్రామానికి చెందిన పాము మల్లేశ్ అదే మండలంలోని అమ్లికుంట్లకు చెందిన జైపాల్ రెడ్డి దగ్గర ఎకరం భూమి కొని ఈ నెల 21న తహసీల్దార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తహసీల్దార్ పాండునాయక్ ‘నీ కోసం 2 గంటలు అదనంగా పని చేసిన.
కాబట్టి రూ.2 వేలు ఇవ్వాల్సిందే’ అని లంచం డిమాండ్ చేశాడు. వదలకుండా సతాయించడంతో ధరణి ఆపరేటర్ రవీందర్‌రెడ్డికి రూ.1000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత మరో భూమి రిజిస్ట్రేషన్ చేయించగా తహసీల్దార్ రిజిస్ట్రేషన్పేపర్లు ఇవ్వడానికి నిరాకరించాడు. ‘లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పపుడు రూ.2 వేలు అడిగితే రూ.వెయ్యి మాత్రమే ఇచ్చావ్. అప్పటి వెయ్యి, ఇప్పటి రూ. 2 వేలు కలిపి రూ.3 వేలు ఇవ్వాల్సిందే’ అని పట్టుబట్టాడు. దీంతో మల్లేశ్ ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయాడు.
తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు బుధవారం తహసీల్దార్ ను కలవగా ఆయన రికార్డ్ అసిస్టెంట్ మొగులప్పకు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. అతడు చెప్పినట్టే ఇచ్చి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి పాండునాయక్ అతడి దగ్గరి నుంచి డబ్బులు తీసుకోగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. తహసీల్దార్‌తో పాటు రవీందర్‌రెడ్డి, మొగులప్పలను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులను హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
