ఏనుమాముల మార్కెట్​లో గన్నీ సంచుల లొల్లి

ఏనుమాముల మార్కెట్​లో గన్నీ సంచుల లొల్లి

రైతులకు గన్నీ బ్యాగులు అమ్మేటప్పుడు ఒక్కోదానికి రూ.80 తీసుకుంటున్న వ్యాపారులు వాటిని తిరిగి రైతుల నుంచి కొనేప్పుడు మాత్రం రూ.30 కూడా చెల్లిస్తలేరు. 

వరంగల్‍, వరంగల్​సిటీ, వెలుగు: రైతులకు గన్నీ బ్యాగులు అమ్మేటప్పుడు ఒక్కోదానికి రూ.80 తీసుకుంటున్న వ్యాపారులు వాటిని తిరిగి రైతుల నుంచి కొనేప్పుడు మాత్రం రూ.30 కూడా చెల్లిస్తలేరు. దీనిపై రైతులు ప్రశ్నించినందుకు సోమవారం ఏకంగా మార్కెట్​నే బంద్ పెట్టిన్రు వరంగల్‍ ఏనుమాముల మార్కెట్ వ్యాపారులు. దీంతో మార్కెట్​కు ధాన్యం తీసుకొచ్చిన రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉమ్మడి వరంగల్‍, చుట్టుపక్క జిల్లాల రైతులు ప్రతి సీజన్‍లో పంటను మార్కెట్ తీసుకురావడానికి వ్యాపారుల వద్ద గన్నీ బ్యాగులను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం వ్యాపారులు రైతుల నుంచి ఒక్కో సంచికి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. రైతులు పంట అమ్ముకున్నాక అవే సంచులకు వ్యాపారులు రూ.30 కూడా ఇవ్వట్లేదు. ఈ దోపిడీపై జిల్లా అడిషనల్‍ కలెక్టర్ శ్రీవత్స గతవారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు రైతులకు కచ్చితంగా రూ.30 చెల్లించాలని చెప్పారు. అయితే వ్యాపారుల తరఫున చాంబర్​ఆఫ్​కామర్స్​దీనికి అంగీకరించలేదు. గన్నీ బ్యాగ్ ధర చెల్లింపు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడంతో వ్యాపారులు సోమవారం నుంచి ఏనుమాముల మార్కెట్లో కొనుగోళ్లు బంద్‍చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియక వివిధ ప్రాంతాల రైతులు ధాన్యంతో మార్కెట్ కు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాపారుల తీరుపై మండిపడ్డారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన పంటను ఏం చేయాలో తెలియక అడ్తిదారుల షాపుల వద్ద ఉంచారు. సమస్య పరిష్కారం కోసం మార్కెట్​కార్యదర్శి, రైతు సంఘాల నేతలు సమావేశమైనప్పటికీ విషయం ఎటూ తేలలేదు. 

మంత్రి ఎర్రబెల్లి రివ్యూ.. కమిటీ నియామకం

వ్యాపారులు మార్కెట్​ బంద్‍ చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు సాయంత్రం హనుమకొండలోని తన క్యాంప్ ఆఫీస్‍లో కలెక్టర్‍, చాంబర్​ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మార్కెట్‍ అధికారులతో దీనిపై సమావేశం నిర్వహించారు. వ్యాపారులు, ఆఫీసర్ల వాదనలు విన్నారు. వ్యాపారులు రైతులకు సహకరించాలని చెప్పారు. గన్నీ బ్యాగుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇద్దరు అధికారులతో ఓ కమిటీ వేశారు. ఇతర ప్రాంతాల మార్కెట్లో గన్నీ బ్యాగుల విక్రయం, కొనుగోళ్లు ఎలా ఉన్నాయనే వివరాలపై ఈ నెల 26న రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. దాని ఆధారంగా రేటు ఖరారు చేద్దామని అప్పటి వరకు గతంలో లెక్కనే రైతులకు ఒక్కో సంచికి రూ.30 చొప్పున ఇవ్వాలని చెప్పారు. అదే సమయంలో చిరిగిన గన్నీ బ్యాగులను రైతులు మార్కెట్‍తీసుకురాకుండా అవగాహన కల్పించాలన్నారు. అలాగే మంగళవారం నుంచి ఏనుమాముల మార్కెట్లో పంట కొనుగోళ్లు యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకున్నారు.