
గుంటూరు జిల్లావాసులకు ఈ మండే ( జూన్ 5) బ్లాక్ మండే గా మిగిలి పోనుంది. జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు. ఒక ప్రమాదం కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందగా.. మరో చోట ట్రాక్టరు పంటకాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద ఓ ట్రాక్టర్ పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలిలోనే ముగ్గురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ముగ్గురు మృతి చెందారు. ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడు నుంచి చేబ్రోలు మండలం జూపూడికి ఓ శుభకార్యం నిమిత్తం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టరులో 40 మంది ఉన్నారు.
ఈ ప్రమాదంలో మరో 20 మందికి గాయాలు కాగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోగా, కొందరు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో ప్రమాదంలో సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు