
వెలుగు, నెట్ వర్క్: గురుపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ధన్వాడ మండల కేంద్రంలోని సాయిబాబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొన్నాల రాజయోగి పాదుక పూజ నిర్వహించారు. గద్వాలలో ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా పాత హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి దేవాలయం లో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతం ను ఘనంగా నిర్వహించారు.
కొల్లాపూర్ మండలం రామాపూర్ గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెబ్బేరులోని శ్రీ షిర్డీ సాయి ఆలయంలో సాయి సేవాసమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. సాయిబాబా రంగురంగుల పూలతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నవీనాచార్యులు స్వామి వారికి కాకడ హారతి, అభిషేకం, గణపతి హోమం చేశారు. సేవా సమితి సభ్యులు ధరూర్ శ్రీను, హనుమంతు రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు, వెంకట్రాంరెడ్డి, శ్రీధర్ గుప్తా, కిశోర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
పీయూలో గురుపూజోత్సవం
పాలమూరు యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురువారం గురుపూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ నెమ్మికంటి సంధ్యారాణి మాట్లాడుతూ.. గురు పూర్ణిమ విశిష్టతను తెలియజేశారు . వేదవ్యాసుడి జన్మదినాన్ని పురస్కరించుకొని గురుపూర్ణిమ జరుపుకోవడం హైందవ సంప్రదాయంలో భాగం అని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు శాఖ లెక్చరర్లు డా. బి. రవీందర్, డా. జె.తిరుపతయ్య, ఎం.ఎ తెలుగు విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.