అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయ్ ఎమోషనల్ పోస్ట్

అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయ్ ఎమోషనల్ పోస్ట్

ఆర్థిక అనిశ్చిత కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో అమెజాన్ ఇండియా కూడా ఒకటి. ఇప్పటికే వేలాది మంది స్టాఫ్ ను ఇంటికి పంపించగా.. మరో వెయ్యి మంది ఉద్యోగులను కూడా తీసివేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఉద్యోగం కోల్పోయిన గురుగ్రామ్ కు చెందిన ఓం ప్రకాష్ శర్మ అనే అమెజాన్ ఎంప్లాయి తన బాధను వ్యక్తం చేస్తూ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశారు. 2022 సంవత్సరం తన జీవితంలోనే అత్యంత సవాలుతో కూడిన సంవత్సరంగా పేర్కొన్నాడు. మొదట తన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది తర్వాత ఐసీయూలో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీని కారణంగా తాను 4 నెలల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో భాగంగా జనవరి 11న అమెజాన్ తనను తీసివేసిందని తెలిపారు. దాని ప్రభావం తనపై చాలా పడిందని.. కానీ అమెజాన్ లో తన 5 సంవత్సరాల ఉద్యోగ జీవితం అత్యంత అద్భుతమైన సమయని చెప్పారు.

కంపెనీలోని కొంతమంది తెలివైన వ్యక్తులతో కలిసి పని చేసేటప్పుడు ప్రతీ క్షణాన్నీ తాను ఆస్వాదించానని, కార్పొరేట్ జీవితం తనకు గొప్ప పాఠాలు నేర్పించిందని ఓం ప్రకాష్ రాసుకొచ్చారు.  కస్టమర్ ఫేసింగ్, సంక్లిష్టమైన, వినూత్నమైన డిజైన్ వంటి సమస్యలపై పని చేసే అవకాశం తనకు లభించిందన్నారు. ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ కోట్ షేర్ చేశారు. ఇక ఇటీవలే 18వేల మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది.  ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత నెలకొన్న కారణంగా ఉద్వాసనలు తప్పవని అమెజాన్ సీఈఓ యాండీ జస్సీ తేల్చి చెప్పారు. అమెజాన్‌తో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి టెక్ సంస్థలన్నీ ఉద్యోగుల తొలగింపుకే మొగ్గు చూపుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం అనిశ్చితిలో కూరుకుపోయింది.