గురుకులానికి వెల్​కమ్​

గురుకులానికి వెల్​కమ్​

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీటీబీసీడబ్ల్యూ) జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష రెసిడెన్షియల్ జూనియర్ కాలేజస్ టెస్ట్ & రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజస్ టెస్ట్ (ఆర్జేసీ & ఆర్డీసీ సెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మెరిట్ సాధించినవారు 2020–21 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఆర్జేసీ సెట్, ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఆర్‌‌డీసీ సెట్ కు అర్హులు. ఏప్రిల్ 7 వరకు ఆన్‌‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆర్జేసీ సెట్ ద్వారా రాష్ర్టంలోని 19 (బాలురు–12, బాలిక‌‌లు–7) గురుకుల జూనియర్ కాలేజీలు, ఆర్డీసీ సెట్ ద్వారా ఒక మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లో ఎంపీసీ, బైసీసీ, సీఈసీ, హెచ్‌‌ఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో, డిగ్రీలో బీఎస్సీ (ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్‌‌సీ, బీబీసీ), బీఏ (హెచ్ఈపీ, హెచ్‌‌పీఈ), బీకాం (జనరల్ & కంప్యూటర్స్) గ్రూపుల్లో చేరొచ్చు. ఈ ఇన్‌‌స్టిట్యూషన్స్ లో ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధనతో పాటు నీట్‍, జేఈఈ, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారు. ఇక్కడ ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు విద్య పూర్తి ఉచితం. అకడమిక్ సబ్జెక్టులే కాకుండా రోజూ వ్యాయామం, స్పోర్ట్స్, గేమ్స్, ఇతర ఎక్స్‌‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‍పై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

 

టిప్స్ ఫర్ సక్సెస్

ఇంగ్లిష్

ఇంగ్లిష్‌‌లో రెండు/మూడు రకాల ప్యాసేజ్‍లుంటాయి. ఒక్కో ప్యాసేజ్‍పై 5 ప్రశ్నలిస్తారు. మొదటి రకం ప్యాసేజ్‍లో కనీసం 120 పదాలకు తగ్గకుండా ఏదైనా ఒక అంశంపై కంటెంట్ వస్తుంది. ఈ ప్యాసేజ్‌‌ల్లో విద్యార్థి అవగాహన (కాంప్రహెన్సన్‍) ను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. అంటే ప్యాసేజ్ థీమ్ ఏంటి? అందులో వాడిన పదాలు ‌‌వాటి అర్థాలు, రచయిత ఉద్దేశం వంటి ప్రశ్నలు అడుగుతారు. రెండో రకం ప్యాసేజ్‍లో 50 నుంచి 60 పదాలకు తగ్గకుండా ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు. ఇందులో ఐదు ప్రశ్నలకు 5 ఖాళీలుంటాయి. వీటిని నాలుగు ఆప్షన్లలో ఇచ్చిన ప్రనౌన్స్, టెన్సెస్‍, కన్‍జంక్షన్స్, ఆర్టికల్స్, ఫామ్‍ఆఫ్‍వర్బ్స్, జెరండ్స్, అడ్‍వర్బ్స్, మోడల్స్ వంటి వ్యాకరణాంశాలతో పూరించాల్సి ఉంటుంది. చివరి రకం ప్యాసేజ్‍ల్లో వాక్యాల్లో తప్పులు ఇస్తారు. ముఖ్యంగా వర్డ్స్ / ప్రేజెస్‍ను తప్పుగా ఇస్తారు. వీటికి సరైన పదాలను ఎంచుకోవాల్సి  ఉంటుంది. మిగిలిన ప్రశ్నల్లో ప్రిపొజిషన్స్, వన్‍వర్డ్ సబ్‍స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, సిననిమ్స్, క్వశ్చన్‍ట్యాగ్స్, ప్రనౌన్స్, టెన్సెస్‍, స్పీచెస్‍, ఫిగర్‍ఆఫ్‍స్పీచెస్‍, ఇడియమ్స్, ప్రేజెస్‍, వాయిసెస్‍, ఆంటోనిమ్స్, బైనామినల్స్, సెంటెన్స్ కరెక్షన్‍, అడ్జెక్టివ్స్, కన్‍జంక్షన్స్, ఆర్టికల్స్, ఫామ్​ ఆఫ్​ వర్బ్స్, జెరండ్స్, అడ్‍వర్బ్స్, మోడల్స్ వంటి దాదాపు అన్ని గ్రామర్ టాపిక్‍ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

మాదిరి ప్రశ్నలు

  1. A person who possesses many talent is a  (Ans: 4)

1) polyglot         2) theist

3) prodigy          4) versatile

  1. Choose the reduplicative that means ‘very small’       (Ans: 2)

1) see–saw          2) teeny–weeny

3) tip–top           4) helter–skelter

  1. Choose the word that refers to a hand written document.             (Ans: 3)

1) Stopover         2) Verbose

3) Manuscript      4) Documentary

మ్యాథమెటిక్స్

వాస్తవసంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి, త్రికోణమితి అనువర్తనాలు, సంభావ్యత, సాంఖ్యక శాస్ర్తం వంటి చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

మాదిరి ప్రశ్నలు

  1. వృత్తం యొక్క బాహ్య బిందువు నుండి వృత్తమునకు ఎన్ని స్పర్శ రేఖలు గీయవచ్చు.

1) 1                   2) 2           (Ans: 2)

3) 3                   4) 4

  1. 10–19 తరగతి యొక్క మధ్య విలువ

1) 24.5               2) 20.5      (Ans: 4)

3) 23.5               4) 14.5

  1. 2x+y = 8, X–అక్షమును ఖండించుకొను బిందువు      (Ans:4)

1) (8,0)              2) (0,8)

3) (0,4)              4) (4,0)

ఫిజికల్ సైన్స్

ఫిజికల్‍సైన్స్‌‌లో ఫిజిక్స్, కెమిస్ర్టీ  కలిసి ఉంటాయి. గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, రసాయనిక సమీకరణాలు, ఆమ్లాలు–క్షారాలు–లవణాలు, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుని కన్ను–రంగుల ప్రపంచం, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతత్వం, లోహ సంగ్రహణ శాస్ర్తం, కార్బన్‍దాని సమ్మేళనాలు వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి షార్ట్‌‌కట్స్ ఏమి ఉండవు. కాన్సెప్ట్ పై నేరుగా ప్రశ్నలు అడుగుతారు. ఈ సబ్జెక్టులో వాయువులు, రసాయన సమీకరణాలు, సూత్రాలు, విద్యుత్ వలయాలు, ఎలక్ర్టాన్ విన్యాసాలు, ఆవర్తన పట్టిక, కటకాలు, ఫార్ములాలు, బొమ్మలపై ఖచ్చితమైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ముఖ్యమైన టాపిక్‍లను బాగా చదువుకోవాలి. లెక్కలపై కనీసం 5 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు ప్రీవియస్ పేపర్లో ప్రశ్నలను గమనించడం ద్వారా సాధన చేయవచ్చు.

మాదిరి ప్రశ్నలు

  1. అంతరిక్షంలో ఉండే వ్యోమగామికి ఆకాశం ఏ రంగులో కన్పిస్తుంది?   (Ans: 4)

1) తెలుపు          2) ఎరుపు

3) నీలం              4) నలుపు

  1. నవీన ఆవర్తన పట్టికలోని మొత్తం అంతర పరివర్తన మూలకాల సంఖ్య            (Ans: 4)

1) 8                   2) 18

3) 30                 4) 28

  1. కింది వాటిలో కుంభాకార దర్పణం యొక్క అనువర్తనం కానిది        (Ans: 2)

1) రియర్ వ్యూ     2) డిష్ యాంటెన్నాస్

3) భద్రత             4) దారికాచడం

బయాలజీ

బయాలజీలో పోషణ–ఆహార సరఫరా వ్యవస్థ, శ్వాసక్రియ–శక్తి ఉత్పాదక వ్యవస్థ, ప్రసరణ, విసర్జన–వ్యర్థాల తొలగింపు వ్యవస్థ, నియంత్రణ – సమన్వయ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, జీవక్రియలలో సమన్వయం, అనువంశికత, మన పర్యావరణం, సహజ వనరులు వంటి పదోతరగతి చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. బయాలజీలో మానవ శరీర ధర్మశాస్ర్తం పైనే దాదాపు 50 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

మాదిరి ప్రశ్నలు

  1. బఠాణి మొక్కలో అంతర్గత లక్షణం

1) లేత నీలం పుష్పం            (Ans: 3)

2) గుండ్రని విత్తనం

3) ముడతలు పడిన కాయ

4) పసుపు రంగు విత్తనం

  1. కింది వాటిలో లామార్క్ ప్రతిపాదించిన సిద్ధాంతం         (Ans: 4)

1) యోగ్యతముల సార్థక జీవనం

2) జనాభాలో వైవిధ్యాలు ఉంటాయి.

3) జనాభా అత్యుత్పత్తి

4) ఆర్జిత గుణాల అనువంశికత

  1. మినిమేటా వ్యాధికి కారణమైన కాలుష్య కారకం           (Ans: 2)

1) Fe     2) Hg    3) Cr         4) Ni

సోషల్‍స్టడీస్‍

ఇందులో రెండు భాగాలున్నాయి. వీటిలోని అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. భారతదేశం–భౌగోళిక స్వరూపాలు, భారతదేశ శీతోష్ణస్థితి, భారతదేశ నదులు, నీటివనరులు, భారతదేశం – జనాభా, ప్రజలు నివాస ప్రాంతాలు ‌‌– వలసలు, అభివృద్ధి భావనలు, ఉత్పత్తి–ఉపాధి, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి – సమానత, భారతదేశం – జనాభా వంటి టాపిక్‍లతో పాటు హిస్టరీ, పౌరశాస్ర్తంలోని ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు, భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్ర్యం, స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ ధోరణుల ఆవిర్భావం, ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, సమకాలీన సామాజిక ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సోషల్‍స్టడీస్‍లో జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రధాన వర్తమాన వ్యవహారాలతో ముడిపెట్టి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఉగ్రవాద దాడుల ఉద్రిక్తతల నడుమ జమ్మూ కాశ్మీర్‍, వాఘా సరిహద్దు, లైన్‍ఆఫ్‍కంట్రోల్‍, సింధు నది జలాలు, అంతర్జాతీయ న్యాయస్థానం వంటి అంశాలు ఇటీవల వార్తల్లో నిలిచాయి.

మాదిరి ప్రశ్నలు

  1. కింది వాటిలో  అంతిమ ఉత్పాదకం కానిది

1) మోటార్ సైకిల్  2) వరి        Ans: 2

3) టెలివిజన్        4) ఇడ్లీ

  1. 1975లో అంగోలా ఏ దేశం నుండి స్వాతంత్ర్యం పొందింది?                (Ans: 2)

1) స్పెయిన్         2) పోర్చుగల్

3) బెల్జియం         4) ఫ్రాన్స్

  1. 1971లో పాకిస్తాన్ పై భారతదేశం ఏ విషయంపై యుద్ధం చేయాల్సి వచ్చింది?

1) సరిహద్దు వివాదం             Ans: 2

2) బంగ్లాదేశ్ వివాదం

3) కాశ్మీర్ విషయం

4) పంజాబ్  విషయం

– వెలుగు ఎడ్యుకేషన్‍డెస్క్

పరీక్షా విధానం

ఆర్జేసీ సెట్ పరీక్ష విధానం, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, టెస్ట్ డ్యురేషన్ తదితర అంశాలు నోటిఫికేషన్‌‌లో పేర్కొనలేదు. కానీ ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న ఆర్జేసీ సెట్ పరీక్షా విధానం, ప్రశ్నల సంఖ్య, మార్కుల ఆధారంగా టెస్ట్ ప్యాటర్న్, ప్రిపరేషన్ టిప్స్ అందిస్తున్నాం. ఈ పరీక్షలో మూడు గ్రూపులకు మూడు వేరు వేరు ప్రశ్నా పత్రాలు ఇస్తారు. ఒక్కో పేపర్‍లో మూడు సబ్జెక్టుల నుంచి 50 మార్కుల చొప్పున 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి. సమయం రెండున్నర గంటలు. ఎంపీసీ పేపర్‍లో ఇంగ్లిష్‍, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులుంటాయి. బైపీసీ వారికి ఇంగ్లిష్‍, ఫిజికల్ సైన్స్‌‌తో పాటు బయాలజికల్ సైన్స్ సబ్జెక్టు చేర్చారు. సీఈసీ లేదా ఎంఈసీ పేపర్‍లో ఇంగ్లిష్‍, సోషల్ స్టడీస్‍, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్ అందరికి కామన్ సబ్జెక్టు. ఎంపీసీ, ఎంఈసీ వారికి మ్యాథ్స్ కామన్ కాగా, ఎంపీసీ, బైపీసీ వారికి ఫిజికల్ సైన్స్ ఉమ్మడిగా ఉంటుంది. ప్రశ్నాపత్రం పదోతరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ముద్రిస్తారు.

 

నోటిఫికేషన్

అర్హత: 2020 మార్చి/ఏప్రిల్​లో పదోతరగతి/ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అర్హులు.

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌‌ఈసీ, బీఎస్సీ, బీఏ, బీకామ్ (ఇంగ్లిష్ మీడియం)

ప్రవేశం: ప్రవేశ పరీక్ష ర్యాంకు, రిజర్వేషన్ ఆధారంగా ఇంట‌‌ర్మీడియ‌‌ట్, డిగ్రీ మొద‌‌టి సంవ‌‌త్సరంలో ప్రవేశం కల్పిస్తారు. ఒక్కో సీటుకు 1:5 నిష్పత్తిలో కౌన్సెలింగ్ కు పిలుస్తారు. ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఒకే ర్యాంకు ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తారు.

ఫీజు: రూ.200

ద‌‌ర‌‌ఖాస్తుకు చివ‌‌రి తేది: 2020 ఏప్రిల్ 7

ప‌‌రీక్ష తేది: 2020 ఏప్రిల్ 19

వెబ్‍సైట్‍: www.mjptbcwreis.telangana.gov.in & www.mjptbcwreis.cgg.gov.in