ప్రమోషన్లు ఇచ్చే వరకు నియామకాలు ఆపండని.. ప్రభుత్వానికి గురుకుల జేఏసీ  వినతి

ప్రమోషన్లు ఇచ్చే వరకు నియామకాలు ఆపండని.. ప్రభుత్వానికి గురుకుల జేఏసీ  వినతి

ఖైరతాబాద్, వెలుగు: తమకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టే వరకు కొత్త నియామకాలు చేపట్టవద్దని గురుకులాల జేఏసీ నేతలు కోరారు. లేదంటే తామంతా నష్టపోతామని జేఏసీ ప్రతినిధులు మామిడి నారాయ ణ, పి.రుషికేశ్​కుమార్​, వి. ప్రభుదాస్ తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో 1022  ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఉన్నాయని,  వాటిలో  పనిచేసే10 వేల మంది టీచర్లకు ఇప్పటికీ ప్రమోషన్లు, బదిలీలు చేపట్టలేదన్నారు.

కొత్త నియామకాలతో తామంతా  తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో  317 ప్రకారం బదిలీలకు ఎదురు చూస్తున్నామని, గత ప్రభుత్వంలో కాళ్లరిగేలా తిరిగినా చేయలేదని విమర్శించారు.  ముఖ్యంగా గురుకులాలను ఒకే  డైరెక్టరేట్(యాజమాన్యం)కింద ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  అన్ని డిగ్రీ కాలేజీల్లో ఏఓ పోస్టులను భర్తీ చేయాలని,  అన్ని గురుకుల కాలేజీలకు డిప్యూటీ వార్డెన్​ పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ద్వారా నియామకం  పొందిన వారికి  పే అండ్​సర్వీసు ప్రొటెక్షన్ ​అమలు చేయాలన్నారు. మంగళవారం సామూహిక సెలవు పత్రాలను పంపుతామన్నారు. ఈ సమావేశంలో ఎ. మధుసూదన్, వీవీ కృష్ణారెడ్డి, వేదాంతచారి తదితరులు పాల్గొన్నారు.