కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఓ కల

కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఓ కల

నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఓ కల మాత్రమే అన్నారు శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీటిని 1956 నుంచే దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేస్తున్నారని అప్పట్లోనే వ్యతిరేకించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదులకు గౌరవం ఇవ్వలేదన్న గుత్తా.. జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకు పోవాలని దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ రాయలసీమ పథకంతో భవిష్యత్తులో నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని అన్నారు. బీజేపీ వాళ్ళది కాకి గోల మాత్రమే వాళ్ళతో ఏం కాదని తెలిపారు.

విభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి  ఉందన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఉత్తర కుమారుడే అని... రేవంత్‌ వి పగటి కలలే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ఓ కల అని.. కాంగ్రెస్ కలహాలు సరిదిద్దడానికే రేవంత్‌ కు సమయం సరిపోదని ఎద్దేవా చేశారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి