వేం నరేందర్ రెడ్డితో అమిత్​ భేటీ

వేం నరేందర్ రెడ్డితో అమిత్​ భేటీ

నల్గొండ, వెలుగు:  శానసమండలి చైర్మన్, బీఆర్ఎస్​ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కొడుకు  అమిత్ రెడ్డి కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొద్దిరోజులుగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో అమిత్​రెడ్డి మంగళవారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో హైదరాబాద్​లో భేటీ అయ్యారు.  భువనగిరి సీటు ఇస్తే కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమని చెప్పడంతో విషయాన్ని హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్తానని వేం నరేందర్​రెడ్డి చెప్పినట్టు తెలిసింది. దీంతో  హైకమాండ్​ నిర్ణయం కోసం గుత్తా సుఖేందర్​రెడ్డి, ఆయన కొడుకు అమిత్​రెడ్డి, వారి అనుచరులు ఎదురుచూస్తున్నారు. 

జిల్లా మంత్రులతో చర్చలు సఫలం..

బీఆర్‌‌ఎస్ నుంచి నల్గొండ లేదా భువనగిరి ఎంపీ సీటును అమిత్‌ రెడ్డి ఆశించారు. కానీ రెండు నెలలుగా హైకమాండ్​ నుంచి టికెట్​పై హామీ రాకపోవడం, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి, అమిత్‌కు మధ్య విభేదాలు తొలగకపోవడం, జగదీశ్​రెడ్డికే హైకమాండ్​ ప్రియారిటీ ఇస్తుండడంతో కాంగ్రెస్​లో చేరాలని అమిత్​రెడ్డి నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్​ ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో చర్చలు జరిపారు. గుత్తా ఫ్యామిలీకి కాంగ్రెస్ లీడర్లతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పార్టీలో చేరేందుకు వారు అంగీకరించినా ఎంపీ టికెట్​పై తుది నిర్ణయం హైకమాండ్​దే  అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో సోమవారం కేసీఆర్ సమక్షంలో జరిగిన నల్గొండ పార్లమెంట్  రివ్యూ మీటింగ్​కు హాజరు కాని అమిత్​రెడ్డి వేం నరేందర్​రెడ్డిని కలవడం విశేషం. 

టికెట్ పై క్లారిటీ కోసం వెయిటింగ్..

భువనగిరి ఎంపీ టికెట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి, ఆయన అన్న కొడుకు సూర్యపవన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు.  భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్​తో  శేఖర్ రెడ్డి భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ దాటుకుని లైన్ క్లియర్ అయితే   సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పెద్దలను కలిసేందుకు అమిత్​ రెడీ అవుతున్నారు.