సాగర్​పై ఏపీ దండయాత్ర దుర్మార్గం : గుత్తా సుఖేందర్​రెడ్డి

సాగర్​పై ఏపీ దండయాత్ర దుర్మార్గం : గుత్తా సుఖేందర్​రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు :  కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం దుస్సాహసం చేసిందని, నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై దండయాత్ర చేసి13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్య అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కోసం న్యాయ పోరాటం చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. 

శనివారం నల్గొండలోని తన ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం.. శ్రీశైలం ఆంధ్ర మెయింటెనెన్స్ లో, సాగర్ తెలంగాణ మెయింటెనెన్స్​లో ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం ఇలా దురాక్రమణ చేయడం సరికాదన్నారు. కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించినా ఆంధ్ర పోలీసులు వెనక్కి పోవడంలేదని, నీటి తరలింపు కూడా కొనసాగుతోందన్నారు. 

రాష్ట్రాల పరిధిలో ఉండే హక్కులను కేంద్రం చేతుల్లోకి పోయేలా ఏపీ కుట్ర చేసిందన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫాల్స్ అని కొట్టిపారేశారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.