కోమటిరెడ్డి ఏం మాట్లాడుతడో ఆయనకే తెల్వదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

కోమటిరెడ్డి ఏం మాట్లాడుతడో ఆయనకే తెల్వదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.  నల్గొండలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హాంగ్ వస్తుందని కోమటిరెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. సర్వేల ప్రకారమే కేసీఆర్ టికెట్ల కేటాయింపుపై నిర్ణయం ఉండొచ్చని అన్నారు. 

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావన్న గుత్తా.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వామపక్షాలతో పొత్తు ఉండొచ్చని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాస్తవ పరిస్థితి ప్రజలు తెలుసన్న ఆయన.. తెలంగాణ భవిష్యత్  కేసీఆర్ చేతిలో మాత్రమే సురక్షితంగా ఉంటుందన్న విషయం వారికి అర్థమైనందని అన్నారు. బీజేపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్ లా తయారయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాలను, మీడియాను అణచి వేయడానికి ఆ పార్టీ కుట్ర చేస్తోందన్నారు.