
2025 సెప్టెంబర్ 21న ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు ఒక్కసారిగా లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకు పైగా) పెంచడం భారతీయులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు పెద్ద షాక్‌గా మారింది. ఈ నిర్ణయం ద్వారా కొత్తగా అమెరికా వెళ్లాలనుకునేవారికి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తనుంది. ఒక లక్ష డాలర్లు స్పాన్సర్ ఫీజు కారణంగా అమెరికాలో కొత్తగా భారతీయులను నియమించడానికి కంపెనీలు వెనుకాడతాయి.
ఇండియన్ ఐటీకంపెనీలు (టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్) ఏడాదికి కనీసం $150 మిలియన్ నుంచి $550 మిలియన్ వరకు అదనపు వీసా ఖర్చు భరించాల్సి వస్తుంది. లక్ష డాలర్ల ఫీజుతో చిన్న ఐటీ కంపెనీలు వీసా స్పాన్సర్ చేయడం ఆపే అవకాశం ఉంది.
పెద్ద కంపెనీలు కూడా ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు విదేశాల్లో (ఇండియాలో) పనులను మరింతగా షిఫ్ట్ చేస్తుంటాయి. ఇండియన్ ఐటీ సంస్థలు, హెచ్1బీ ఆధారిత పని శైలి నుంచి స్థానిక ఉద్యోగులను పెంచడం, రిమోట్ వర్క్ విధానాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాయి.
2024లో ఆమోదం పొందిన మొత్తం 3,99,395 హెచ్1బీ వీసాలలో 71% మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 25-30% తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. అంటే, మొత్తం హెచ్1బీ కోటాలో కనీసం 10-15% వరకు తెలుగువారు ఉన్నారు. వీళ్లకు మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. కానీ భారత్ నుంచి కొత్తగా అమెరికా వెళ్లే టెక్నాలజీ జాబ్స్ ఆశించేవారి ఆశలకు మాత్రం పెద్ద షాక్‌గా మారింది.
అమెరికాలోని పలు కంపెనీలు హెచ్1బీ టాలెంట్‌పై ఆధారపడుతుండటంతో అక్కడకు వెళ్లే కొత్త ప్రతిభను కోల్పోతున్నారు. ఇది అమెరికా టెక్ రంగానికి, భారత్‌లోని యువతకు రెండువిధాల నష్టం. ఐటీ రంగంలో బాధిత ఉద్యోగులే కాకుండా మహిళలు, కుటుంబ సభ్యులు, విద్యార్థులపై కూడా దీని ప్రభావం పడుతుంది.
ఐటీ కంపెనీ షేర్లపై ప్రభావం
అమెరికాలో ఉన్నవారికి ఇది నేరుగా ఇబ్బంది కలిగించదు. అంతేకాకుండా ఆల్రెడీ అమెరికాలో నియామకం జరిగినవారికి జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్తవారు రావడానికి ఇబ్బంది ఉండటంతో ఉన్నవారికి జీతాలు పెరిగి అవకాశం ఉంది. ఈ వీసా మార్పుల వలన అనేక కుటుంబాలపై, చదువు, వారి జీవనవిధానంపై ప్రభావం చూపుతాయి.
భారత ఐటీ కంపెనీల్లో నేటికీ అమెరికాలో ప్రాజెక్టులు నిర్వహించే విధానానికి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారీగా పెరిగిన ఫీజులతో కంపెనీలపై అధికభారం పడడంతో, ఈ భారం కనుక కస్టమర్లపై విధిస్తే కంపెనీల మధ్య పోటీ వాతావరణం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అమెరికా విధించిన వీసా ఫీజు ప్రభావంతో స్టాక్ మార్కెట్ల ఐటీ కంపెనీ షేర్లు కూడా గణనీయంగా పడిపోయాయి.
అమెరికా ఫీజు భారంతో కొత్త ఉద్యోగాలు తగ్గిపోతే భారత్‌కు వచ్చే రెమిటెన్స్ కూడా తగ్గిపోయి అమెరికా నుంచి వచ్చే డబ్బు తగ్గిపోతుంది. భారతీయులకు అమెరికా అవకాశాలు తగ్గితే ప్రతిభావంతులైనవారికి కెనడా, యూరప్, ఆస్ట్రేలియా వైపు ఎక్కువగా వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి.
అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఏ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత్ కూడా మరికొన్ని వాణిజ్య చర్యలకు తీసుకోవడానికి ఆస్కారం ఉంది.
అమెరికా కంపెనీలకు, అక్కడి యువతకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ, ఒకవేళ అక్కడ ధరలు పెరిగిన కంపెనీలు నష్టపోయినట్లైతే తిరిగి ఈ నిర్ణయంలో మార్పులు ఉండడానికి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రపంచ మేధోసంపత్తితో..అమెరికాకు ఆర్థికబలం
పేద దేశాలు ప్రతిభతో పాశ్చాత్య దేశాలని గడగడలాడిస్తున్నాయి. ప్రతిభ కేవలం సంపన్న దేశాలదే భావించి ప్రపంచం ఓ కుగ్రామం అని నినదించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధోసంపత్తికి ఆకర్షణీయమైన జీతభత్యాలను, ఆయా దేశాల పౌరసత్వాలు ఇచ్చి ఆహ్వానించి ప్రపంచంలో మేటి అయిన దేశంగా ఎదగాలని ఆశించి భంగపడుతున్న తరణం కనబడుతున్నది.
నేటి అమెరికా ఆర్థిక బలానికి ప్రపంచ దేశాలలోని యువత మేధోసంపత్తి ఎంతో బలం చేకూర్చింది. కానీ, తన స్వదేశంలో ఉన్న యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించటంలో ఘోరంగా విఫలమైన అమెరికా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.
నాణ్యమైన మానవనుల నిర్మాణంలో విఫలమైన అమెరికా దేశం ప్రపంచ దేశాల మానవ వనరులపైన ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని భుజాన వేసుకుంది. అమెరికాలో అనేక విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగులులా పుట్టుకొచ్చి కనీస నాణ్యత ప్రమాణాలు లేని విద్యా విధానాన్ని అమరికా పౌరులకే కాకుండా, ప్రపంచంలోనే మిగతా దేశాల విద్యార్థులకు అందించి నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషించుకుంది.
ఈ నిరుద్యోగం నుంచి గట్టెక్కడం కోసం హెచ్ 1 బీ వీసాలపై భారీగా ఫీజులను పెంచి, ప్రపంచ దేశాల యువత అమెరికా వైపు ప్రయాణానికి అడ్డుకట్ట వేస్తుంది. అమెరికా ఆర్థికవ్యవస్థకు ఆయువుపట్టువైన నాణ్యమైన మానవ వనరులకు పరోక్షంగా ప్రతిబంధకంగా తయారవుతుంది.
భారత్ యువతకు సదవకాశం
భారతదేశంలో ఉన్నటువంటి నేటి యువ జనాభా వ్యాపారస్తులుగా మారడానికి, వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. భారత్ విలువలతో, నైతికత కూడిన వ్యాపారం, బలమైన కుటుంబ వ్యవస్థ , సామాజిక బంధాలు, పటిష్టమైన ప్రజాస్వామ్యం, భారత్ తన సొంత అభివృద్ధితోపాటు సంపూర్ణమైన దేశాల్ని ఆవిష్కరించడంలో ప్రపంచ దేశాలకి ఒక పాఠంగా ఎదగడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి, ఈ దేశంలో ఉన్న యువత ప్రతి ఒక్కరు తన కర్తవ్య బాధ్యతగా తమ తమ పనులను, సమస్యలను సులభంగా, సరళంగా పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, విభిన్న శీతోష్ణస్థితులు కలిగి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమైన భారత్... తన మూలాలను బలపరుచుకొని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా సరికొత్త భారత్‌ను ఆవిష్కరించడానికి ప్రతి వ్యక్తి తన తోడ్పాటును అందించాలి.
చిన్న ఉద్యోగాలు పెద్ద భవిష్యత్తుకు పునాదులు
ఒక వ్యక్తి తెలివితేటలు, నైపుణ్యాలు సాన పెట్టుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు పెద్ద భవిష్యత్తుకు పునాదులుగా నిలుస్తాయి. ఒక్కసారి పూర్తిస్థాయి నాణ్యమైన మానవ వనరులు తయారైన తర్వాత ఇతర దేశాల వైపు వెళ్లడానికి ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశంలో యువత తమ మేధోసంపత్తిని ఆయా దేశాలకు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్లయితే అవి ఆర్థికంగా మరింత పరిపుష్టి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నాణ్యమైన విద్య కోసం నిత్యం పరితపించే అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఆ మానవ వనరులను కాపాడుకునే సదవకాశం ట్రంప్ రూపంలో వచ్చిందని భావించవచ్చు. భారతదేశం కూడా ఆర్థిక స్వావలంబన కోసం మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
భారతదేశ యువత వాణిజ్య, వ్యాపార రంగాలలో సరికొత్త విధానంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన ఆర్థిక, సాంకేతిక, మేధోపరమైన మద్దతును సంపూర్ణంగా అందించడానికి అనేక కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది.
కొన్ని కంపెనీలకు మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని కంపెనీలకు, ఉద్యోగులకు మినహాయింపు ఇస్తున్నట్టు అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగం, ఇంజినీరింగ్ రంగాలలో ఉద్యోగులుగా ఉన్నవారికి ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని, అదేవిధంగా అమెరికా జాతీయ ప్రయోజనం కోసం అవసరమైనవారికి అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి ఫీజు మినహాయింపు ఇవ్వవచ్చు అని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పటికే హెచ్ వన్ బీ వీసా కలిగి ఉన్నవారు గత 12 నెలలుగా అమెరికా వెలుపల ఉన్నట్లయితే, 2025 సెప్టెంబర్ 21 లోపు తిరిగి అమెరికాలోకి రావాలని లేదంటే కొత్త ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొనడం తెలిసిందే.
- చిట్టెడ్డి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్‌సీయూ-