రాజ్యసభ రేసులో  అరడజను మంది!

రాజ్యసభ రేసులో  అరడజను మంది!
  •  2 స్థానాల్లో ఒకటి ఏఐసీసీ లీడర్​కు అంటున్న పార్టీ వర్గాలు

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎంపీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న చర్చ మొదలైంది. అరడజను మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే టికెట్లను వదులుకున్న నేతలు, సీనియర్ లీడర్లను ఈ లిస్టులో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండగా.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా రెండు సీట్లు కాంగ్రెస్​కు, ఒక స్థానం బీఆర్ఎస్ కు దక్కే చాన్స్ ఉంది.

కాంగ్రెస్ కు దక్కే ఆ రెండు స్థానాల కోసం పార్టీలో పోటీ ఎక్కువగానే ఉన్నది. ఒక స్థానం పార్టీలోని సీనియర్లకు అవకాశం ఇచ్చి.. మరో స్థానంలో ఏఐసీసీ నేతను నామినేట్ చేయాలని భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీనియర్​ నేత జానా రెడ్డి, వీహెచ్​ల పేర్లు ఈ జాబితాలో ముందు వరుసలో వినిపిస్తున్నాయి.  అయితే, జానారెడ్డి తనయుడు నల్గొండ ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యే సీటును వదులుకున్న పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నా రెడ్డికి ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

దాంతో పాటు రేణుకా చౌదరి, మధు యాష్కీ, అద్దంకి దయాకర్​ల పేర్లూ వినిపిస్తున్నాయి. బీసీ కేటగిరీలో పరిశీలిస్తే మధు యాష్కీ, వీహెచ్​లలో ఒకరికి అవకాశం దక్కే సూచనలున్నాయని చెప్తున్నారు. అలాగే వంశీచంద్ రెడ్డి కూడా రాజ్యసభ ఎంపీ పదవి రేసులో ఉన్నారు.

ఎవరా ఏఐసీసీ లీడర్? 

రాష్ట్రం నుంచి ఏఐసీసీకి చెందిన ఒక లీడర్​ను నామినేట్​ చేస్తారన్న పార్టీ వర్గా లు చెప్తున్నాయి. అయితే, ఎవరా లీడర్ అన్న చర్చ  నడుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రా నికి ఇన్​చార్జ్​గా ఉన్న దీపాదాస్​ మున్షీని తెలంగాణ నుంచే నామినే ట్​ చేస్తారన్న ప్రచారం సాగుతున్నది. మరోవైపు మాజీ ఇన్​చార్జ్​ మాణిక్ రావ్ ఠాక్రేని కూడా ఇక్కడి నుంచి నామినేట్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. అయితే మూడు స్థానాలనూ దక్కించుకునేందుకు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్​ నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.