బీఆర్​ఎస్​ అభ్యర్థుల్లో.. సగం మంది ఫోర్​ ట్వంటీలే! : రేణుకా చౌదరి

బీఆర్​ఎస్​ అభ్యర్థుల్లో..   సగం మంది ఫోర్​ ట్వంటీలే!   :  రేణుకా చౌదరి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగం మంది ఫోర్​ ట్వంటీలేనని కాంగ్రెస్​ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. తర్వాత కొత్తగూడెం క్లబ్​లో నిర్వహించిన ప్రజా చైతన్య సభలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్​ కొత్తగూడెం నుంచే రణభేరి మోగించిందన్నారు. మాయ మాటలతో మోసం చేస్తున్న సీఎం కేసీఆర్​కు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేసీఆర్​ప్రత్యేక నిఘా పెట్టారని విమర్శించారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్​ ప్రభుత్వాలేనన్నారు. కొత్తగూడెంలో ఒంటరిగా ఆడమనిషి తన సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నారన్నారు. రాఘవ ఒక ఫోర్​ ట్వంటీ అని ఆరోపించారు. అన్నం పెట్టిన తల్లి లాంటి కాంగ్రెస్​ను మోసం చేసిన ఘనత ఎమ్మెల్యే వనమాకే దక్కుతుందన్నారు. కొత్తగూడెం టికెట్​ను బీసీలకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. ఈ ప్రోగ్రాంలో టీపీసీసీ జనరల్​సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ, ఓబీసీ జాతీయ కో ఆర్డినేటర్​ కత్తి వెంకటస్వామి, నాయకులు మల్లికార్జున్, అంథోటిపాల్, లక్కినేని సురేందర్​, దళ్​సింగ్, డాక్టర్​ శంకర్​ నాయక్​, పగడాల మంజుల పాల్గొన్నారు.