లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఎరువులు సగం కూడా రాలె

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఎరువులు సగం కూడా రాలె
  • కరోనా లాక్‌డౌన్‌తో ప్రభావం
  • మేలో 4 లక్షల టన్నులు రావాలి.. వచ్చింది మాత్రం 1.75 లక్షల టన్నులే
  • యూరియా బఫర్ స్టాక్ సగం కూడా లేదు
  • జూన్‌లో పెరగనున్న అవసరాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎరువుల సరఫరాపై కరోనా ప్రభావం పడుతోంది. ఈయేడు వానాకాలం సాగు కోసం కేంద్రం ఎరువుల కేటాయింపులు ఎక్కువగానే చేసినా రాష్ట్రానికి సగం కూడా చేరలేదు. పది, పదిహేను రోజుల్లో సీజన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కానుంది. ఎరువుల అవసరం గణనీయంగా పెరగనుంది. కానీ ఇప్పుడున్న నిల్వలు రైతుల అవసరాలకు ఏమాత్రం సరిపోయేలా లేవు. రుతుపవనాలు వచ్చే లోగా ఎరువుల సరఫరాకు సిద్ధం చేయాల్సి ఉండగా సప్లయ్‌‌‌‌‌‌‌‌కి లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ దెబ్బ పడుతోంది.

అవసరమైన యూరియా నిల్వలు లేవు
వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో 10.5 లక్షల టన్నుల యూరియా కేటాయింపులు చేయగా ఇప్పటి వరకు 2.97 లక్షల టన్నులు రావాల్సి ఉంది. కానీ కేవలం 1.44 లక్షల టన్నులే సప్లయ్‌‌‌‌‌‌‌‌ జరిగింది. మే నెల కేటాయింపుల్లో 66 శాతం, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ కోటాలో 30 శాతం రాలేదు. ఇప్పటివరకు రావాల్సిన యూరియాలో 48 శాతమే వచ్చింది. మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ వద్ద యూరియా బఫర్‌‌‌‌‌‌‌‌ స్టాక్‌‌‌‌‌‌‌‌ కనీసం 4 లక్షల టన్నులు ఉండాలి. కానీ 2.28 లక్షల టన్నులే ఉంది. డీలర్ల వద్ద 91 వేల టన్నులు, సొసైటీల వద్ద 49 వేల టన్నులు మాత్రమే నిల్వ ఉంది. ఎరువులన్నీ కలిపి డీలర్ల వద్ద 2.29 లక్షల టన్నులు, సొసైటీల దగ్గర 87 వేల టన్నులు, మార్క్ ఫెడ్ దగ్గర 2.91 లక్షల టన్నులు, కంపెనీల వద్ద 1.29 లక్షల టన్నులతో కలిపి మొత్తం 7.35 లక్షల టన్నుల స్టాక్ ఉంది. పరిస్థితి చూస్తే సీజన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభానికి కష్టాలు తప్పేలా లేవు.

అప్రమత్తం కావాలె
వానాకాలంలో సర్కారు పత్తి, కంది పంటలు అధికంగా వేయాలంటోంది. మరో వైపు వరి, మక్కలు భారీగా సాగు జరగనుంది. దీంతో యూరియా, డీఏపీ, ఏపీకే కాంప్లెక్స్ ఎరువుల అవసరాలు పెరగనున్నాయి. ఏటా జూన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం నాటికే ఎరువులకు భారీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ కోసం కేంద్రం 25.5 లక్షల టన్నుల ఎరువుల కేటాయింపులు చేసింది. ఇది నిరుడు వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌ కంటే దాదాపు 3.7 లక్షల టన్నులు ఎక్కువే. కానీ సప్లయ్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఇప్పటి వరకు 28 శాతమే చేరుకుంది. ఈ నెలలో అప్రమత్తం కాకపోతే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్రాన్స్ పోర్టు సమస్యలు
రాష్ట్రానికి సరిపడా ఫర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ రాక పోవడానికి ఇంపోర్ట్స్‌‌‌‌‌‌‌‌, ట్రాన్స్‌‌పోర్టు సమస్యలే కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా విదేశాల నుంచి రావాల్సిన ఫర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌ ముడి సరకు రాలేదు. దీంతో ఎరువుల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు ఇప్పటికే వచ్చిన ఎరువులను రైల్వేల ద్వారా ట్రాన్స్‌‌పోర్టు చేయడానికి అవసరమైన హమాలీ, లేబర్లు లేక లోడింగ్ , అన్ లోడింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రవాణాకు ఆలస్యం అవుతోంది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో సమస్య ఎదురవుతోంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటిదాకా 6.88 లక్షల టన్నుల ఎరువులు అందాల్సి ఉండగా కేవలం 3.62 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి చేరాయి. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ కోటా 2.87 లక్షల టన్నుల్లో 1.85 లక్షల టన్నులే వచ్చింది. మే నెలలో 4 లక్షల టన్నుల కేటాయింపుల్లో ఇప్పటిదాకా 1.75 లక్షల టన్నుల సరఫరానే జరిగింది.