
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో పని చేసే వర్కర్లలో 55.1 శాతం మంది రెగ్యులర్ లేదా శాలరీడ్ జాబ్ కలిగిన వాళ్లేనని సోషియో ఎకనమిక్ ఔట్ లుక్ రిపోర్ట్–2022లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో అర్బన్ పాపులేషన్ వాటా 38.88 శాతం ఉండగా, 2022 నాటికి 46.84 శాతానికి చేరింది. ఇది 2036 నాటి 57.32 శాతానికి పెరిగే అవకాశముందని రిపోర్ట్ లో ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ ప్రస్తుత ధరల్లో రూ.11.55 లక్షల కోట్లుగా నమోదైందని, తలసరి ఆదాయం రూ. 2.26 లక్షలుగా ఉందని పేర్కొంది. తెలంగాణకు హరిత హారం ప్రోగ్రాంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.
జీడీడీపీలో రంగారెడ్డి టాప్
గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్(జీడీడీపీ)లో ప్రస్తుత ధరల ప్రకారం రూ. 1,93,507 కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రూ.1,62,877 కోట్లతో హైదరాబాద్ జిల్లా సెకండ్ ప్లేస్ లో, రూ.70,870 కోట్లతో మేడ్చల్ మల్కాజిగిరి థర్డ్ ప్లేస్లో నిలిచాయి. రూ.37,948 కోట్లతో నల్లగొండ, రూ. 36,951 కోట్లతో సంగారెడ్డి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రూ.9 వేల కోట్లతో కుమ్రంభీం అసిఫాబాద్, నారాయణపేట జిల్లాలు, రూ.5,746 కోట్లతో ములుగు జిల్లా చివరి స్థానంలో నిలిచాయి.