సీజ్ఫైర్, బందీల విడుదలకు హమాస్ ఓకే

సీజ్ఫైర్, బందీల విడుదలకు హమాస్ ఓకే
  • తమ వద్ద ఉన్న బందీల విడుదలకు అంగీకారం
  •  మిగతా అంశాలపై చర్చల తర్వాతే నిర్ణయం
  •  ట్రంప్ డీల్​లో ఫస్ట్ స్టేజ్ ప్లాన్ అమలుకు సిద్ధమన్న ఇజ్రాయెల్
  •  దాడులు ఆపేయాలన్న ట్రంప్
  • ఆ తర్వాత కొన్ని గంటలకే మళ్లీ దాడులు చేసిన ఐడీఎఫ్


గాజా/జెరూసలెం:  గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో కొన్ని అంశాలకు తాము అంగీకరిస్తున్నామని హమాస్ మిలిటెంట్లు శుక్రవారం ప్రకటించారు. వెంటనే కాల్పుల విరమణకు, బందీల విడుదలకు సిద్ధమని వెల్లడించారు. హమాస్ ఆదివారం సాయంత్రంలోగా తన డీల్​కు ఒప్పుకోవాలని, లేదంటే నరకం చూడాల్సి ఉంటుందని ట్రంప్ శుక్రవారం హెచ్చరించారు. దీంతో మొత్తం 20 పాయింట్లతో కూడిన ఈ డీల్​లో ఈ రెండు పాయింట్లకు అంగీకరిస్తున్నట్టు ప్రకటించిన హమాస్.. మిగతా అంశాలపై మాత్రం చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. మరోవైపు, ట్రంప్ డీల్​కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓకే చెప్పారు. ఈ డీల్​లో పేర్కొన్నట్టుగా ఫస్ట్ స్టేజ్ ప్లాన్ అమలుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో గాజాలో తక్షణమే బాంబు దాడులు ఆపేయాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు. కానీ ట్రంప్ సూచనను బేఖాతరు చేస్తూ.. శనివారం గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ బాంబుదాడులు చేసింది.

డీల్​పై హమాస్, ఇజ్రాయెల్ స్పందన ఇలా.. 

గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ 20 పాయింట్లతో డీల్ ను ప్రతిపాదించారు. ఈ డీల్ ప్రకారం.. ఇరుపక్షాలు ఒప్పందానికి అంగీకరించిన తర్వాత 72 గంటల్లోపు హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలందరినీ విడిచిపెట్టాలి. చనిపోయిన వారి డెడ్ బాడీలనూ అప్పగించాలి. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ తన వద్ద ఉన్న 250 మంది పాలస్తీనియన్ ఖైదీలను రిలీజ్ చేయాలి. ఖైదీల మృతదేహాలనూ తిరిగి అప్పగించాలి. దీనికి ఇజ్రాయెల్ పూర్తిగా అంగీకరించగా.. బందీల విడుదలకు 72 గంటల టైం సరిపోదని హమాస్ పేర్కొంది. అలాగే వెంటనే యుద్ధాన్ని ఆపేందుకు హమాస్, ఇజ్రాయెల్ ఒప్పుకున్నాయి. కానీ డీల్​లో పేర్కొన్నట్టుగా ఇజ్రాయెల్ బలగాలు దశలవారీగా కాకుండా వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని హమాస్ డిమాండ్ చేసింది. పాలస్తీనియన్లకు తక్షణ సహాయం అందించేందుకు ట్రంప్ చేసిన ప్రపోజల్​కు హమాస్ ఓకే చెప్పింది. అయితే, పాలస్తీనియన్లను విదేశాలకు తరలించాలన్న పాయింట్ ను మాత్రం వ్యతిరేకించింది. అలాగే గాజా పాలనను పాలస్తీనా సంస్థకే అప్పగించాలని హమాస్ డిమాండ్ చేసింది.

మళ్లీ ఇజ్రాయెల్ దాడులు.. ఆరుగురు మృతి 

యుద్ధాన్ని ఆపేయాలని ఇజ్రాయెల్, హమాస్​కు ట్రంప్‌‌‌‌  పిలుపునిచ్చినప్పటికీ ఇజ్రాయెల్‌‌‌‌ మాత్రం గాజాపై దాడులు ఆపలేదు. శనివారం గాజా స్ట్రిప్‌‌‌‌లో కాల్పులు, బాంబు దాడులకు పాల్పడటంతో ఆరుగురు మృతి చెందారు. గాజా సిటీలో ఓ ఇంటిపై  జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఖాన్ యూనిస్‌‌‌‌లో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించారని స్థానిక అధికారులు వివరించారు.

శాంతి స్థాపన దిశగా ముందడుగు: మోదీ 

ట్రంప్ డీల్​కు హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. గాజా లో శాంతి పునరుద్ధరణ దిశగా ముందడుగు అని మోదీ ట్వీట్ చేశారు. శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు. ఈ ప్రయత్నాలకు ఇండియా మద్దతిస్తుందని చెప్పారు.