ఇజ్రాయెల్​ దాడి.. గాజాలో200 మంది మృతి

ఇజ్రాయెల్​ దాడి.. గాజాలో200 మంది మృతి
  •     హమాస్​ హెల్త్ ​మినిస్ట్రీ ప్రకటన
  •     గాజా నలు దిశలా ఇజ్రాయెల్​ ఆర్మీ మోహరింపు

గాజా :  ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 200 మందికి పైగా మరణించారని హమాస్​ హెల్త్​ మినిస్ట్రీ సోమవారం తెలిపింది. ఆదివారం రాత్రిపూట జరిగిన ఈ దాడిలో 200 మందికి పైగా అమరవీరులు చనిపోయారని, గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఈ నష్టం జరిగినట్లు పేర్కొంది. యూఎన్​ కాల్పుల విరమణ పిలుపును ఇజ్రాయెల్​పట్టించుకోవడంలేదని ఆరోపించింది. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర పోరు కీలక దశకు చేరుకుంది. గాజాను నలుదిక్కులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ భద్రతా దళాలు.. దాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి.“గాజా నగరాన్ని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించాం.

ఈ యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ. మేం మరింత తీవ్రంగా దాడులు చేయబోతున్నాం’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు గాజా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాయి. మరో 48 గంటల్లో అటువైపు నుంచి గాజా భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశాలున్నట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఉత్తర గాజాలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. కాగా, దక్షిణ లెబనాన్‌‌‌‌‌‌‌‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నలుగురు పౌరులు మరణించారు.

కాల్పుల విరమణకు ఒప్పుకోం: నేతన్యాహు

బందీలను హమాస్ వదిలి పెట్టేవరకు కాల్పుల విరమణ జరగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి స్పష్టంచేశారు. ‘‘మేం గెలిచే వరకు ఈ యుద్ధం కొనసాగిస్తాం. యుద్ధాన్ని ప్రారంభించింది హమాసే. మమ్మల్ని అంతం చేయాలని ఆ ముఠా కోరుకుంది. అందుకే మేం దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాం’’ అని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. వెస్ట్​బ్యాంకుకు వెళ్లి పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్​తో భేటీ అయ్యారు. అక్కడి నుంచి బాగ్దాద్​ వెళ్లి ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో సమావేశమయ్యారు. ఆపై తుర్కియేకు వెళ్లారు. ఇలా పశ్చిమాసియాలో దౌత్య యత్నాలను అమెరికా ముమ్మరం చేసింది.

ఉక్రెయిన్​పై రష్యామిసైల్ దాడులు 19 మంది సైనికులు మృతి 

కీవ్ :  ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ మిసైల్ దాడులు చేసింది. మిలటరీ అవార్డు సెర్మనీ లక్ష్యంగా అటాక్ చేసింది. ‘‘జపోరిజియాలో శుక్రవారం మిలటరీ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ లక్ష్యంగా రష్యా మిసైల్ ప్రయోగించింది. ఈ దాడిలో మా సైనికులు 19 మంది చనిపోయారు” అని ఉక్రెయిన్ సోమవారం వెల్లడించింది. దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపింది. ఒడెసాలోనూ రష్యా డ్రోన్, మిసైల్ అటాక్స్ జరిపిందని చెప్పింది.

ఈ దాడిలో 8 మంది గాయపడ్డారని, నేషనల్ ఆర్ట్ మ్యూజియం ధ్వంసమైందని పేర్కొంది. కాగా, రష్యా అధీనంలో ఉన్న క్రిమియాలోని కెర్చ్ పోర్ట్ సిటీపై ఉక్రెయిన్ మూడ్రోజుల కింద మిసైల్ దాడులు చేసింది. ఇందులో రష్యా యుద్ధ నౌక ఒకటి దెబ్బతింది. క్రూయిజ్ మిసైళ్లను మోసుకెళ్లే ఆ నౌక పూర్తిగా ధ్వంసమైందని, దీంతో ఉక్రెయిన్​పై రష్యా ప్రతీకార  దాడులు చేసిందని సమాచారం.