
రిషాన్ లెజియోన్(ఇజ్రాయెల్) : ఇజ్రాయెల్ పౌరు లను, చిన్నారులను బందీలుగా చేసుకున్న హమాస్ ఆ తర్వాత వారిపట్ల కఠినంగా వ్యవహరించింది. వారికి సరైన ఫుడ్ పెట్టకుండా చీకటి గదిలో వేసి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. తాజాగా హమాస్ చెర నుంచి విడుదలైన ఇజ్రాయెల్ పౌరుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన వారి ఆరోగ్యం బాగా క్షీణిచిందని.. సరైన ఫుడ్ లేకపోవడంతో వారు బరువు తగ్గారని డాక్టర్లు తెలిపారు. విడుదలైన వారి ఆరోగ్య పరిస్థితిని వెల్లడించకూడదంటూ అధికారులు తమను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ ఆరోగ్య నివేదికలు హమాస్ చెరలో ఉన్న మరికొందరు బందీలకు ప్రాణ సంకటంగా మారకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారాన్ని రాతపూర్వకంగా బయటకు చేరవేస్తామనే ఉద్దేశంతో మేం పెన్సిల్ అడిగినా హమాస్ మిలిటెంట్లు ఇచ్చే వారు కాదు. రోజుకు కొంచెమే ఫుడ్పెట్టేవారని.. అందులో పండ్లు, కూరగాయలు, గుడ్లు ఉండేవి కావని ఓ బాధితురాలు తెలిపింది.
హమాస్ నుంచి విడుదలైన12 ఏండ్ల బాలుడు తన భయానక అనుభవాన్ని తన బామ్మతో పంచుకోగా ఆమె మీడియాకు చెప్పింది. 16 రోజుల పాటు ఓ చీకటిగదిలో బాలుడిని ఉంచారని.. బాంబుల శబ్దానికి అతను ఎంతో భయపడ్డాడని ఆమె తెలిపింది. కాగా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 50కి పైగా బందీలు విడతల వారీగా బయటకు వచ్చారు.