
గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్‌తో సీజ్‌ఫైర్ ఒప్పందం అమలులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే గాజాను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నాలను హమాస్ ముమ్మరం చేసింది. యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ 8 మంది గాజా పౌరుల(పాలస్తీనియన్లు)కు సోమవారం సాయంత్రం మరణ శిక్షను అమలు చేసింది. వాళ్ల కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి కట్టేసి కొడుతూ గాజా సిటీలోని సబ్రాకు తీసుకెళ్లారు.
నడిరోడ్డుపై వారిని మోకాళ్లపై కూర్చోబెట్టిన హమాస్ టెర్రరిస్టులు.. అందరూ చూస్తుండగానే బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆకుపచ్చ హెడ్‌బ్యాండ్‌లు ధరించిన టెర్రరిస్టులు ఎనిమిది మందిని కాల్చి చంపే ముందు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కొట్టడం వీడియోలో కనిపించింది. వారి మృతదేహాల చుట్టూ గుమ్మిగూడిన జనం నుంచి 'అల్లాహు అక్బర్ ' అనే నినాదాలు వినిపించాయి.
వీడియోలపై హమాస్ స్పందిస్తూ.. మరణ శిక్షకు గురైనవారంతా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ సైన్యానికి గూఢచర్యం చేశారని.. హమాస్ స్థావరాలను, కీలక నేతల గురించి సమచారం ఇచ్చారని ఆరోపించింది. శాంతి ఒప్పందం కుదిరి, ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గిన వెంటనే గాజాలో హమాస్ తన అధికారాన్ని తిరిగి స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ట్రంప్ సీరియస్ వార్నింగ్
గాజాలో 8 మందిని హమాస్ కాల్చి చంపిన ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. " గాజాకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని హమాస్ కాల్చిచంపింది. అది నన్ను పెద్దగా బాధించలేదు. కానీ హమాస్ ఇప్పటికే ఆయుధాలను విడిచిపెట్టాలి. లేకుంటే మేమే వారిని నిరాయుధులను చేస్తాం" అని హెచ్చరించారు.