తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : కలెక్టర్ సిక్తా పట్నాయక్​

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : కలెక్టర్ సిక్తా పట్నాయక్​
  • హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్​

ఎల్కతుర్తి, వెలుగు : అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన కలెక్టరేట్​లో ఆదివారం అధికారులతో సమీక్షించారు. శనివారం ఉదయం అకాల వర్షం కారణంగా పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందని, ఈ విషయంలో రైతులు అధైర్య పడొద్దన్నారు. తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని తెలిపారు.

జిల్లాలో ఇప్పటి వరకు 150 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 52 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయన్నారు. ఇప్పటి వరకు 686 రైతుల నుంచి 3653.720 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాల దృష్ట్యా మిగతా టార్పాలిన్ కవర్లు సమకూర్చాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. కాంటాలు పూర్తయిన వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి, అన్​లోడ్​, డేటా ఎంట్రీ చేయాలని డీఆర్డీవో, డీసీవోను సూచించారు.  

కేంద్రాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్​

అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని అడిషనల్ కలెక్టర్ వెంకట్​రెడ్డి ఆదివారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రైతులు అధైర్య పడొద్దన్నారు. రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు పంపి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వెంట ఏవో రాజ్​కుమార్, ఏపీఎం రవీందర్, ఆర్ఐ సదానందం ఉన్నారు.  

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

జనగామ అర్బన్, వెలుగు: జనగామ జిల్లాలోని అడవికేశవపూర్, నర్మెట మండలంలోని బొమ్మకూరు, హనుమంతాపూర్​లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదివారం సందర్శించి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.

ధాన్యం కాంటా అవ్వగానే ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని, ఎటువంటి నిర్లక్ష్యం తగదని, ఓపీఎంఎస్​లో వెంటనే నమోదు చేయాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట డీటీసీఎస్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.