టీఆర్‌‌ఎస్‌ నేత హత్య కేసులో నాయిని రాజేందర్‌‌ రెడ్డికి క్లీన్ చిట్

టీఆర్‌‌ఎస్‌ నేత హత్య కేసులో నాయిని రాజేందర్‌‌ రెడ్డికి క్లీన్ చిట్

హన్మకొండ జిల్లా: టీఆర్‌‌ఎస్‌ నేత హత్య కేసులో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి హైకోర్టులో క్లీన్ చిట్ వచ్చింది. హన్మకొండలో 2017 జులై 13న జరిగిన టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో రాజేందర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయనపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో చార్జ్‌షీట్‌ నుంచి ఆయన పేరు తొలగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. 

అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ హత్య కేసులో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఎఫ్‌ఐఆర్‌‌లో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పేరును ఏ4గా చేర్చారు. అయితే తనకు ఈ హత్య కేసుతో ఎటువంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌‌లో రాజేందర్ రెడ్డి పేరు పెట్టిన పోలీసులు.. ఈ హత్యలో ఆయన పాత్ర ఉన్నట్టు ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు చూపించలేకపోయారని, దీంతో ఆయన పేరు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన నాయిని రాజేందర్‌‌ రెడ్డి.. చివరికి న్యాయమే గెలిచిందని, తనపై రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారని తేలిపోయిందని అన్నారు.