చిన్నారుల్లో హెచ్ఎఫ్ఎం డిసీజ్

చిన్నారుల్లో హెచ్ఎఫ్ఎం డిసీజ్

మంకీపాక్స్ ఈ పేరు వింటేనే జనం ఇప్పుడు భయపడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఒంటిపై పొక్కులు కనిపిస్తే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. మంకీపాక్స్ సోకిందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అది కాకపోతే చికెన్ పాక్స్ అయి ఉంటుందని హడలిపోతున్నారు. ఈ రెండు కాకుండా ఈ మధ్యకాలంలో పిల్లలకు మరో వైరస్ సోకుతోందని డాక్టర్లు చెబుతున్నారు. అదే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్. మంకీపాక్స్, చికెన్ పాక్స్, హెచ్ఎఫ్ఎంల మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.

జ్వరం, ఒంటి నొప్పులు, నీటి పొక్కులు

దేశంలో ఇప్పటి వరకు 8 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా ఒంటిపై పొక్కులు కనిపిస్తే జనం భయపడుతున్నారు. చిన్నపిల్లల ఒంటిపై పొక్కులు లేదా నీటి బుడగల్లా తేలినా.. తల్లిదండ్రులు హడలిపోతోన్నారు. వెంటనే ఉరుకుల పరుగుల మీద వైద్యులను సంప్రదిస్తున్నారు. మంకీ పాక్స్ కాకపోతే.. మరి చికెన్ పాక్సా అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ హైరానా పడుతోన్నారు.  
సాధారణంగా వానాకాలం లో వైరస్ లు విజృంభిస్తాయి. ముఖ్యంగా పిల్లలను వైరల్ వ్యాధులు వెంటాడతాయి. ఈ ఏడాది హ్యండ్ ఫుట్ మౌత్ వైరస్ ఎక్కువగా సోకుతోంది. జ్వరం, బాడీపెయిన్స్తో పాటు.. చేతులు, కాళ్లు, పాదాలు, పిరుదులు, నోటి లోపల.. బయట పొక్కులు వస్తాయి. నోటీ లోపల పుండ్లు కారణంగా పిల్లలు గొంతు నొప్పితో బాధపడతారు. ఈ లక్షణాలు ఉంటే దీన్ని హెచ్ఎఫ్ఎం డీజీజ్ గా గుర్తించాలని వైద్యులు అంటున్నారు.

చిన్నారులకు మాత్రమే సోకే వైరస్ 

శరీరం మీద అన్ని చోట్లా.. పొక్కుల్లా వస్తే దాన్ని చికెన్ పాక్స్ అంటారు. అలా కాకుండా.. పాదాలు, చేతులు, కాళ్లు, నోటిలో మాత్రమే వస్తే మంకీ పాక్స్, చికెన పాక్స్ అనుకోవద్దని  వైద్యులు చెబుతున్నారు. ఇక మంకీపాక్స్ లో పొక్కులు శరీరం అంతటా రావడంతో పాటు నీటి బుడగల్లా వస్తాయి. అయితే.. మంకీ పాక్స్ వచ్చిన వారిని కాంటాక్ట్ అయితేనే మంకీ పాక్స్ వస్తుంది. హెచ్ఎఫ్ఎం కూడా అంటు వ్యాధే. ఈ డిసీజ్ సోకిన వారిని తాకినా, వారు వాడిన వస్తువులను యూజ్ చేసినా ఇతరులకు సోకుతోంది. ఇక చిన్నారుల నుంచి చిన్నారులకే  ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుందని, పెద్దలకు చాలా అరుదుగా వస్తుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా స్కూళ్లలో ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తోంది. కేవలం 3 నుంచి 7 రోజుల్లో ఈ వ్యాధి ఇతర పిల్లలకు సోకుతోంది. 4 నుంచి 8 వారాల పాటు మలంలో వైరస్ సజీవంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

వారం రోజుల్లో తగ్గిపోయే వైరస్

ప్రతి వానాకాలంలో ఈ వైరస్ సోకడం సాధారణమే అయినా.. ఈ ఏడాది మూడొంతుల పిల్లలకు సోకుతోంది. రెండున్నరేళ్లుగా ఇంట్లోనే ఉన్న పిల్లలు.. ఒకేసారి బయట వాతావరణంలోకి వచ్చారు. దీనికి తోడు.. ఈ ఏడాది వానలు కూడా ఎక్కువగా ఉండడంతో.. వైరస్ లు వ్యాపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. అయితే హెచ్ఎఫ్ఎం దానికదే సహజంగా తగ్గిపోతోంది. కేవలం లక్షణాలను బట్టి.. ఫీవర్, మంట, దురదలకు మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. నోట్లో పుండ్ల కారణంగా ఘన పదార్ధాలు తినలేనందున పిల్లలకు ద్రవ పదార్ధాలను ఎక్కువగా ఇవ్వడం ద్వారా.. బాడీ డీ హైడ్రేట్ కాకుండా చూడాల్సి ఉంటుంది. వేడివేడిగా ఫుడ్ ఇవ్వకుండా..  మసాలాలు లేని లైట్ డైట్ ఇవ్వాలని చెబుతున్నారు. అరుదైన  కేసుల్లో మాత్రమే వ్యాధి నిరోధకత తగ్గితే.. మెదడు వాపు, న్యూమోనియా, ఉపిరితిత్తుల వాపు, రక్తస్రావం, గుండె కండరాలు బలహీన పడే మయోకారైటిస్ బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాలలో ఖచ్చితంగా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలని సూచిస్తున్నారు.

"హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ కేసులు ఈ ఏడాది పెరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి12 ఏళ్ల పిల్లల వరకు ఈ వైరస్ సోకుతుంది. చేతులు కాళ్లు, నోటిలో నీటి పొక్కులు వస్తాయి. వారంలో తగ్గిపోతుంది. అరుదైన కేసుల్లోనే  బ్రెయిన్, హార్ట్కు సంబంధించిన కాంప్లికేషన్స్ వస్తాయి. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నా వారం రోజుల్లో తగ్గిపోతుంది." -శ్రీకాంత్, పిడియాట్రిషన్