- ఆకట్టుకున్న జెమీమా, బౌలర్లు
- హాలీడే, ఇసాబెల్లా పోరాటం వృథా
నవీ ముంబై: సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియా విమెన్స్ జట్టు జూలు విదిల్చింది. ఓపెనర్లు స్మృతి మంధాన (95 బాల్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109), ప్రతీకా రావల్ (134 బాల్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122) సెంచరీలతో దుమ్మురేపడంతో.. గురువారం (అక్టోబర్ 23) జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా 53 రన్స్ (డక్ వర్త్ లూయిస్) తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఫలితంగా నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.
టాస్ ఓడిన ఇండియా ఓవర్లన్నీ ఆడి 340/3 స్కోరు చేసింది. జెమీమా రొడ్రిగ్స్ (55 బాల్స్‌లో 11 ఫోర్లతో 76 నాటౌట్) చెలరేగింది. తర్వాత న్యూజిలాండ్ టార్గెట్‌ను 44 ఓవర్లలో 325 రన్స్‌గా నిర్దేశించారు. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 271/8 స్కోరుకే పరిమితమైంది. బ్రూక్ హాలీడే (84 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 81) టాప్ స్కోరర్. ఇసాబెల్లా గాజె (51 బాల్స్‌లో 10 ఫోర్లతో 65 నాటౌట్) పోరాడి విఫలమైంది. రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ చెరో రెండు వికెట్లు తీశారు. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యాలు..
వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ గాడిలో పడిన టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఈ టోర్నీలో అత్యధిక స్కోరును సాధించింది. ఓపెనర్లు స్మృతి, ప్రతీకా.. తేమతో కూడిన వాతావరణంలో కివీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ముఖ్యంగా మంధానా లేట్ కట్స్, పవర్‌ఫుల్ స్ట్రోక్స్‌తో ఆన్ సైడ్‌లో వరుసగా బౌండ్రీలు బాదితే.. ప్రతీకా ఆఫ్ సైడ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఇద్దరి జోరుతో పరుగులు వరదలా పారాయి. స్పిన్నర్ ఈడెన్ కార్సన్ బౌలింగ్‌లో సిక్స్‌తో మంధానా టచ్‌లోకి రాగా, ప్రతీకా ఎక్కువగా ఫోర్లతో విరుచుకుపడింది.
ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ చేసిన రావల్ రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. కెరీర్‌లో 14వ సెంచరీ చేసిన మంధానాకు వరల్డ్ కప్‌లో ఐదోది కావడం విశేషం. తొలి వికెట్‌కు 212 రన్స్ జోడించి మంధానా ఔటైంది. తర్వాత వచ్చిన జెమీమా.. కివీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసింది. గ్రౌండ్ నలుమూలల భారీ షాట్లతో రెచ్చిపోయింది. 39 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేసి మెగా టోర్నీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. రెండో వికెట్‌కు 76 రన్స్ జోడించి ప్రతీకా వెనుదిరిగినా.. జెమీమా మాత్రం దూకుడును ఆపలేదు. హర్మన్‌ప్రీత్ (10) మళ్లీ ఫెయిలైనా ఇండియా భారీ స్కోరు చేసింది.
బౌలర్లు సూపర్..
ఛేజింగ్‌లో కివీస్‌ను ఇండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. రెండో ఓవర్‌లోనే సుజీ బేట్స్ (1)ను ఔట్ చేసి క్రాంతి గౌడ్ శుభారంభాన్నిచ్చింది. దీన్ని మిగతా బౌలర్లు కూడా కొనసాగించారు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేసి రన్స్‌ను అడ్డుకున్నారు. జార్జియా ప్లిమెర్ (30), అమెలియా కెర్ర్ (45) ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసి వికెట్‌ను కాపాడుకున్నారు. వీలైనప్పుడల్లా బౌండ్రీలు సాధించి రెండో వికెట్‌కు 50 రన్స్ జోడించి కుదురుకున్నారు.
ఇక ఓకే అనుకున్న దశలో రేణుకా సింగ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. తన వరుస ఓవర్లలో ప్లిమెర్, సోఫీ డివైన్ (6)ను ఔట్ చేసింది. ఫలితంగా కివీస్ 59/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రూక్ హాలీడే కీలక ఇన్నింగ్స్ ఆడింది. రెండో ఎండ్‌లో కెర్ర్ అండగా నిలిచింది. ఈ ఇద్దరు మంచి అవగాహనతో ఆడటంతో ఇండియా బౌలర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే 21వ ఓవర్‌లో స్నేహ్ రాణా (1/60) కెర్ర్ ను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 56 రన్స్ భాగస్వామ్యాన్ని ముగించింది.
ఓ ఎండ్‌లో హాలీడే నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో ఇండియా బౌలర్లు పట్టు బిగించారు. ఫలితంగా ఐదో వికెట్‌కు 39 రన్స్ జోడించి మ్యాడీ గ్రీన్ (18) ఔటైంది. గ్రీన్ స్థానంలో వచ్చిన ఇసాబెల్లా గాజె ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకుంది. దాదాపు పది ఓవర్లు హాలీడేతో కలిసి భారీ షాట్లు ఆడింది. అప్పటికే హాఫ్ సెంచరీ చేసిన హాలీడేను 39వ ఓవర్‌లో శ్రీచరణి (1/58) పెవిలియన్‌కు పంపడంతో ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. చివర్లో జెస్ కెర్ర్ (18), రోస్‌మేరి మెయిర్ (1)తో కలిసి ఇసాబెల్లా పోరాటం చేసినా అప్పటికే చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లుః
ఇండియా: 49 ఓవర్లలో 340/3 (స్మృతి 109, ప్రతీక 122, సుజీ బేట్స్ 1/40). న్యూజిలాండ్: 44 ఓవర్లలో 271/8 (హాలీడే 81, ఇసాబెల్లా 65*, రేణుకా సింగ్ 2/25, క్రాంతి గౌడ్ 2/48).
1 ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్ స్మృతి మంధాన (31). లిజెల్ లీ (28) రెండో ప్లేస్‌లో ఉంది.
1విమెన్స్ వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక రన్స్ చేసిన తొలి ప్లేయర్ మంధాన (133 ఇన్నింగ్స్‌లో 5186). సుజీ బేట్స్ (133 ఇన్నింగ్స్‌ల్లో 5088) రెండో స్థానంలో ఉంది.
