హత్యతో సంబంధం ఉంటే నన్ను బహిరంగంగా ఉరితీయండి

హత్యతో సంబంధం ఉంటే నన్ను బహిరంగంగా ఉరితీయండి
  • మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి పునరుద్ఘాటన

కడప: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కు బాబాయ్ అయిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ఎలాంటి సబంధం లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. తనకు ఏమాత్రం సంబంధం ఉందన్నా బహిరంగంగా ఎక్కడైనా ఉరితీయొచ్చని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన తనపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. ఎస్‌.ఉప్పలపాడు, పెద్దపసుపుల తదితర గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ  వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి 2019, మార్చి 15న అనుమానాస్పద స్థితిలో చనిపోయారని చెప్పారు. ప్రస్తుతం కేసు సీబీఐ విచారణ జరుగుతోందని, ఇంకా తనపై అనుమానం ఉందంటే ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు ధర్నాకు కూర్చోవాలని ఆయన సూచించారు. కేసు విచారణ ముగిసిన తర్వాత హత్యకు ఎవరు పాల్పడ్డారో వారిపై అక్కడే చర్యలు తీసుకోవాలని సూచించారు. వివేకా హత్య కేసులో సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని ఖండించారు.