నడిమిట్ల ఊరు చుట్టుముట్టు నీళ్లు

నడిమిట్ల ఊరు చుట్టుముట్టు నీళ్లు
  • బోధన్‌లోని హంగర్గను ముంచిన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్
  • బిక్ నెల్లి, కందకుర్తి, అల్జాపూర్‌లోకీ వరద 
  • 3 వేల ఎకరాల్లో పంట నష్టం 
  • తెప్పపై వెళ్లి పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

బోధన్/నవీపేట్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్​ మండలంలోని హంగర్గ(వి)ను ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ముంచెత్తింది. నాలుగు దిక్కులా వరద చుట్టుముట్టింది. దీంతో దాదాపు 1,200 మంది వరదలో చిక్కుకుపోయారు. తెలంగాణ-, మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా పాత బ్రిడ్జి, ప్రత్యామ్నాయంగా నిర్మించిన ఖండ్గావ్ బ్రిడ్జి కూడా నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేయగా, గ్రామస్తులు రావడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. బుధవారం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్సారెస్పీ సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్, ట్రైనీ ఐఏఎస్ మకరన్, ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ గఫార్ మియా తదితరులు తెప్పపై గ్రామానికి వెళ్లి జనానికి ధైర్యం చెప్పారు. కాగా, రెంజల్ మండలంలోని కందకుర్తి, నవీపేట్ మండలంలోని అల్జాపూర్ ను కూడా వరద చుట్టుముట్టింది. అల్జాపూర్ కు వెళ్లే రోడ్డు రోడ్డు మొత్తం నీట మునిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తెప్పలపై గ్రామాలకు వెళ్లి మంచినీళ్లు, బిస్కెట్లు అందజేశారు. చివరిసారి 1983 ఆగస్టులో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఊళ్లలోకి వచ్చాయని చెప్పారు. 

పోలీస్ బందోబస్తు..
గ్రామస్తులకు మంచి నీళ్లు, నిత్యావసర సరుకులు అందజేయాలని ఆర్డీఓను ఆదేశించినట్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వరద ఎక్కువగా వస్తోందని, దీంతో బ్యాక్ వాటర్ గ్రామంలోకి వస్తోందని తెలిపారు. వరద వల్ల బిక్ నెల్లి, హంగర్గ, కందకుర్తి గ్రామాల్లో దాదాపు 3 వేల ఎకరాల్లో వరి, సోయాబీన్ పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. పంటనష్టం అంచనా వేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హంగర్గలో బ్యాక్ వాటర్ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.