కొన్నేండ్ల నుంచి వింత వైరస్‌లు, వ్యాధులకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య ఒక షిప్‌లో హంటావైరస్ వ్యాప్తి కలకలం రేపింది. హ్యాజ్‌మాట్ సూట్లు వేసుకున్న వైద్య సిబ్బంది వైరస్ సోకినవాళ్లను తీసుకెళ్తున్న దృశ్యాలను చూసి ప్రపంచం ఉలిక్కిపడింది. ఎంతోమంది మళ్లీ కొవిడ్ లాంటి కొత్త రోగమేదో వచ్చిందని భయపడ్డారు. ఈ హంటా వైరస్ అంత ప్రమాదకరమైందా? ఎలా వ్యాపిస్తుంది? మనుషులకు ఎలా సోకుతుంది?.. ఇలాంటి విషయాలతో ప్రత్యేక కథనం..
ఎంవీ హోండియస్ ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్. అంటార్కిటికా, ఫాల్క్‌ల్యాండ్ దీవులు, సౌత్ జార్జియా లాంటి ప్రాంతాలను సందర్శించేందుకు 23 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ప్రయాణికులతో ఈ షిప్ బయల్దేరింది. ఏప్రిల్ 1న దక్షిణ అర్జెంటీనాలో ఉషుయా నుంచి టూర్ మొదలైంది. అయితే.. షిప్‌లో ప్రయాణిస్తున్న డచ్‌కు చెందిన ఒక వ్యక్తి(70 ఏళ్లు) ఏప్రిల్ 11న చనిపోయాడు. అతని భార్య(69 ఏళ్లు) ఏప్రిల్ 24న సెయింట్ హెలెనా ద్వీపంలో హోండియస్ ఆగినప్పుడు దిగిపోయింది. అక్కడినుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లింది.
అక్కడే జోహన్నెస్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో అస్వస్థతకు గురైంది. ఏప్రిల్ 26న ఆసుపత్రిలో చనిపోయింది. అదే షిప్‌లో ప్రయాణించిన ఒక జర్మన్ మహిళ కూడా మే 2న చనిపోయింది. క్రూయిజ్‌లో ప్రయాణించడానికి ముందు ఆ వృద్ధ డచ్ దంపతులు అర్జెంటీనాలోని ఉషుయా సిటీ, ఉరుగ్వే, చిలీలను సందర్శించారు. ఈ ముగ్గురు హంటావైరస్ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. వీళ్లే కాదు.. మరో ఐదుగురు ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మరోవైపు అర్జెంటీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. వాళ్ల దేశంలో 2025 జూన్ నుంచి ఇప్పటివరకు దేశంలో 101 హంటావైరస్ కేసులు నమోదైనట్లు తెలిపింది.
దాంతో డచ్ దంపతులకు కూడా అక్కడే వైరస్ సోకిందని భావిస్తున్నారు. అందుకే షిప్‌లో ప్రయాణించి యూకే, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, యూఎస్, స్విట్జర్లాండ్‌తో సహా పలు దేశాలకు ఇప్పటికే విమానాల్లో తిరిగి వెళ్లిన ప్రయాణికులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ నౌకలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. కానీ.. వాళ్లలో వైరస్ లక్షణాలు కనిపించలేదని, ఆరోగ్యంగానే ఉన్నారని సమాచారం.
ఇది కొత్తదేమీ కాదు
హంటావైరస్ కొత్త వ్యాధి ఏమీ కాదు. ఇది హంటావిరిడే అనే వైరస్ కుటుంబానికి చెందినది. ప్రధానంగా ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. 1950లలో కొరియన్ యుద్ధం టైంలో హంటన్ నదీ సమీపంలో ఉన్న సైనికుల్లో చాలామందికి ఈ వైరస్ సోకింది. దాంతో దీనికి ‘హంటావైరస్’ అని పేరు పెట్టారు.
ప్రాణాంతకమా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పిన వివరాల ప్రకారం.. హంటావైరస్ వల్ల ప్యాండమిక్ పరిస్థితులు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ. ఇది కొవిడ్ లాంటిది కాదు. అంత ఈజీగా ఒకరినుంచి ఒకరికి వ్యాపించదు. కానీ.. ఈ వ్యాధి సోకితే మాత్రం ప్రాణాలకు ప్రమాదమే. ప్రస్తుతం షిప్‌లో గుర్తించింది ఆండెస్ అనే స్ట్రెయిన్. ప్రపంచంలో 38కి పైగా స్ట్రెయిన్‌లు ఉన్నాయి. వాటిలో ఆండెస్ మాత్రమే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే స్ట్రెయిన్. మిగతా స్ట్రెయిన్‌లు ఎలుకల నుంచి మాత్రమే మనుషులకు వ్యాపిస్తాయి.
ఆండెస్ కూడా ఇద్దరు రోగుల మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంటేనే వ్యాపిస్తుంది. బహిరంగ ప్రదేశాలు, దుకాణాలు, ఆఫీస్‌లు, స్కూళ్లలో ఒకరినుంచి ఒకరికి వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ. ఇది మాత్రమే మనుషుల మధ్య ఎందుకు వ్యాపిస్తుందనేది ఇంకా తెలియలేదు. మనిషి లాలాజలంలోని యాంటీవైరల్ పవర్‌ను తట్టుకునే సామర్థ్యం ఈ వైరస్ రకానికి ఉండటమే ఇందుకు కారణమని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. వైరస్ సోకిన తర్వాత సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని నిర్ధారించడానికి టెస్ట్‌లు ఉన్నాయి. కానీ.. ట్రీట్‌మెంట్ అందుబాటులో లేదు. కనిపించే లక్షణాల ఆధారంగా చికిత్స(సపోర్టివ్ ట్రీట్‌మెంట్) చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు.
రెండు వ్యాధులు
హంటావైరస్ వల్ల ప్రధానంగా రెండు రకాల వ్యాధులు వస్తాయి. అవి..
హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్‌పీఎస్): ఇది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ప్రారంభంలో జ్వరం, తీవ్రమైన చలి, కండరాల నొప్పులు (ముఖ్యంగా తొడలు, వెన్ను, భుజాల వద్ద), అలసట, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
4 నుంచి 10 రోజుల తర్వాత దగ్గు మొదలవుతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైన పరిస్థితి.
హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్): ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తీవ్రమైన వెన్నునొప్పి, కడుపు నొప్పి, వాంతులు, రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల కిడ్నీలు పనిచేయడం ఆగిపోయే ప్రమాదం ఉంది.
ఎలా వ్యాప్తి చెందుతుంది?
గాలి: ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ ధూళిని మనుషులు పీలిస్తే.. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. వైరస్ వ్యాప్తికి ఇదే ఎక్కువ అవకాశాలు ఉన్న మార్గం.
టచ్ చేస్తే..: గాలి ద్వారా ఈ వైరస్ వస్తువులపైకి చేరుతుంది. ఆ వస్తువులను తాకినప్పుడు మన చేతుల ద్వారా కళ్లు, ముక్కు లేదా నోటిలోకి వైరస్ ప్రవేశిస్తుంది.
ఎలుక కాటు: వైరస్ సోకిన ఎలుక మనిషిని కరిచినప్పుడు చాలా అరుదుగా వ్యాధి సంక్రమిస్తుంది.
మనిషి నుంచి మనిషికి: దక్షిణ అమెరికాలో ముఖ్యంగా అర్జెంటీనా, చిలీలో ఎక్కువగా కనిపించే ఆండెస్ స్ట్రెయిన్ మాత్రమే వ్యక్తుల మధ్య వ్యాపించే అవకాశం ఉంది.
గతంలో..
చైనాలో 2004 నుంచి 2019 మధ్య కాలంలో దాదాపు 2 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోని మొత్తం హంటావైరస్ (హెచ్ఎఫ్ఆర్ఎస్ రకం) కేసుల్లో దాదాపు 90 శాతం చైనాలోనే నమోదవుతున్నాయి.
అర్జెంటీనాలోని ఎపుయెన్ గ్రామంలో ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లినవాళ్లకు ఈ వ్యాధి సోకింది. గ్రామంలో 2018 నవంబర్ నుంచి 2019 ఫిబ్రవరి మధ్య 34 కేసులు నమోదవగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు (అరిజోనా, కొలరాడో, న్యూ మెక్సికో, యూటా) కలిసే ఫోర్ కార్నర్స్ ప్రాంతంలో 1993లో ఇది హఠాత్తుగా విజృంభించింది. 33 కేసులు నమోదయ్యాయి. అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
