జై హనుమాన్ స్క్రిప్ట్‌ సిద్ధం.. సీక్వల్ మొదలుపెట్టనున్న ప్రశాంత్

జై హనుమాన్ స్క్రిప్ట్‌ సిద్ధం.. సీక్వల్ మొదలుపెట్టనున్న ప్రశాంత్

హనుమాన్(HanuMan)..  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ఈ సూపర్ హీరో సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటించాడు. మొదటి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన పదిరోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది హనుమాన్. 

ఇక సినిమాలో హనుమాన్ చూపించిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అవుతున్నారు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారిని దర్శించినట్టుగా అనుభూతి చెందుతున్నారు. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే హనుమాన్ ఎంట్రీకి థియేటర్స్ దేవాలయాలుగా మారిపోతున్నాయి. జై హనుమాన్ నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. లాస్ట్ షాట్ లో హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కూడా రానుంది అంటూ ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 

దీంతో ఈ సీక్వెల్ పై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. జై హనుమాన్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? హనుమాన్ గా ఏ హీరో కనిపిస్తారు? రిలీజ్ ఎప్పుడు ఉంటుంది? అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే తాజాగా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట నేపధ్యంలో జై హనుమాన్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్‌ స్క్రిప్ట్‌ సిద్ధమైందని హైదరాబాద్‌లోని ప్రముఖ హనుమాన్‌ ఆలయంలో సీక్వెల్‌ స్క్రిప్ట్‌ను హనుమంతుడి విగ్రహం ముందు ఉంచారు. ప్రీ ప్రొడక్షన్‌ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం ఇంకేం ఉంటుందని, సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని.. ప్రశాంత్‌ తెలిపారు. దీంతో సీక్వల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్లు హ్యాపీ గా ఫీలవుతున్నారు.

ఇక ఇటీవల ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో భాగంగా జై హనుమంగురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు ప్రశాంత్. జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హనుమంతు పాత్రలోనే కనిపిస్తారు కానీ, ఆంజనేయుడి పాత్రలో మాత్రం ఓ స్టార్‌ హీరో కనిపిస్తారని, 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు ప్రశాంత్. మరి చిన్న హీరోతోనే ఈ రేంజ్ హిట్టు కొట్టిన ప్రశాంత్.. స్టార్ హీరోతో అది కూడా హనుమంతులవారి పాత్రతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.