ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్​ రూరల్, వెలుగు: స్థానిక బొమ్మకల్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్​లో సోమవారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిండర్ గార్డెన్ పిల్లల తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు వారి మనుమలు, మనవరాళ్లతో కలిసి వేడుకలో పాల్గొన్నారు. అనంతరం పిల్లలు చేసిన డాన్స్​అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ బబిత విశ్వనాథన్, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.

వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి

మండల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష 

గంగాధర, వెలుగు: జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​ తెలిపారు. బూరుగుపల్లిలోని తన నివాసంలో ఆరు మండలాల ఎంపీడీవోలు, ఎస్సైలు, తహసీల్దార్లతో సోమవారం ఆయన సమీక్షించారు. కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా మూడు రోజుల కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలన్నారు. సెప్టెంబర్​16న గంగాధర జెడ్పీహెచ్ఎస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీలతారెడ్డి, సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజావాణిలో 213 దరఖాస్తులు

కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు 213 అర్జీలు స్వీకరించారు. ఈడీ ఎస్సీ కార్పొరేషన్‍కు 80, మున్సిపల్ కార్పొరేషన్ కు 15 దరఖాస్తులతోపాటు ఇతర శాఖల అధికారులకు ప్రజలు దరఖాస్తులు ఇచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్‍ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రజావాణికి వస్తున్నారని, అర్జీలపై అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ వాట్సాల్ టోప్పో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం:కలెక్టర్ రవి

జగిత్యాల: ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జగిత్యాల కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. జగిత్యాలలోని ఐఎంఏ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 22 మంది అడిషనల్ కలెక్టర్లు బిఎస్. లత, అరుణశ్రీ, కలెక్టర్ కు అర్జీలు అందించారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నగదురహిత లావాదేవీలపై అవగాహన

ముత్తారం,వెలుగు: మండలంలోని మైదంబండ గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ మంథని బ్రాంచ్ ఆధ్వర్యంలో ముత్తారం సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి వినియోగదారులకు నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక రుణాలు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు పర్సనల్​లోన్లు, వాహన రుణాల గురించి వివరించారు. లోన్లు కావల్సినవారు మంథని కేడీసీసీ బ్యాంక్ లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో బ్యాంక్ మంథని బ్రాంచ్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్, సర్పంచ్ శారద, ఎంపీటీసీ శ్యామల, సంఘం సీఈఓ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు. 

మున్సిపల్​ కార్మికుల మాదిరి వేతనాలివ్వండి

కలెక్టరేట్ ​ముందు జీపీ కార్మికుల నిరసన

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : నెలకు రూ.8,500 వేతనంతో బతుకు వెళ్లదీస్తున్నామని, మున్సిపల్ కార్మికులకు ఇచ్చినట్టే తమకూ సమాన వేతనాలివ్వాలని పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ ముందు వంటావార్పుతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ, జీపీ వర్కర్స్ యూనియన్ లీడర్లు మాట్లాడారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ లీడర్లు ఎ. గణేశ్, ఎం.రమేశ్, కె.రమణ, జీపీ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు నరసయ్య , కార్యదర్శి, నాయకులు రాజయ్య , లక్ష్మణ్ , శ్రీనివాస్ , మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.  

అధికారమే లక్ష్యంగా పని చేయాలి

మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని నియోజకవర్గ బీజేపీ ఇన్​చార్జి జేఎన్ వెంకట్ అన్నారు. సోమవారం పార్టీ ఆఫీస్ లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ గా నియమితులైన గుంటుక సదాశివ్ ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరుట్లలో బీజేపీని బలోపేతం చేసేందుకు మెట్ పల్లి కి చెందిన సదాశివ్ ను కో కన్వీనర్ గా నియమించిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్ఎల్ఎన్ ను పకడ్బందీగా అమలు చేయాలి

కరీంనగర్‍ సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రారంభించిన ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం(ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రైమరీ స్కూళ్లలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‍లో  విద్యాధికారులు, హెడ్మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ఎల్ఎన్ ను ప్రారంభించిందన్నారు. విద్యార్థుల్లో భాష, గణితంలో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఈఓ జనార్దన్ రావు, సెక్టోరల్ అధికారులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, ఆంజనేయులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

యూనివర్సిటీ పోటీల్లో ‘కిమ్స్’కు అవార్డులు 

కరీంనగర్​ టౌన్, వెలుగు: ఇటీవల నగరంలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి పోటీల్లో కిమ్స్ కాలేజీ స్టూడెంట్స్ కు అవార్డులు వచ్చాయని వైస్ చైర్మన్ సాకేత్ రామారావు తెలిపారు. సోమవారం స్థానిక రేకుర్తిలోని కాలేజీలో నిర్వహించిన అభినందన సభలో అవార్డులు గెలుచుకున్న స్టూడెంట్స్ ను ఆయన ప్రశంసించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యంగ్ మేనేజ్ మెంట్, ఈ క్విజ్ పోటీలో సృజన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచి అవార్డు సొంతం చేసుకున్నాడన్నారు. మార్కెటింగ్ లో సపూర, సుష్మ, మమత, సౌమ్య సెకండ్ ప్రైజ్ సాధించారని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.శ్వేత, లెక్చరర్స్ అరవింద్ రెడ్డి, అనిల్, సందీప్, సుమలత, స్టూడెంట్స్ పాల్గొన్నారు.