హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు

హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం ఉదయం హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎర్ర కోట వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. బైక్​లకు జాతీయ జెండాలు కట్టుకుని అక్కడి నుంచి పార్లమెంటు దగ్గరలోని  విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్​తో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అన్ని పార్టీల ఎంపీలు ర్యాలీలో పాల్గొనాలని అంతకుముందు రోజే పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలను పురస్కరించుకుని ఫ్రీడం ఫైటర్లకు నివాళులర్పించేందుకు, ప్రజలలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు రోజు దేశవ్యాప్తంగా తిరంగా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా సోషల్ మీడియా ఖాతాలకు తిరంగాను డీపీ పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

డీపీగా జెండా పట్టుకున్న నెహ్రూ ఫొటో..

తిరంగాను డీపీగా మార్చుకోవాలన్న ప్రధాని పిలుపుతో బీజేపీ నేతలంతా తమ సోషల్ మీడియా ఖాతాలకు జాతీయ జెండాను పట్టుకున్న మోడీ ఫొటోను పెట్టుకున్నారు. బుధవారం కాంగ్రెస్ నేతలు కూడా డీపీలు మార్చుకున్నారు. అయితే, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలంతా జెండా పట్టుకుని ఉన్న మన దేశ మొదటి ప్రధాని నెహ్రూ ఫొటోను డీపీగా మార్చుకున్నారు.