బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి వేధింపుల కలకలం

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి వేధింపుల కలకలం

ఇద్దరు ఉద్యోగులపై బాధిత విద్యార్థిని ఫిర్యాదు
వన్ మెన్ కమిటీ ఏర్పాటు చేసిన అధికారులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు ఉద్యోగుల వేధింపులు కలకలం రేపుతున్నాయి. బాధిత విద్యార్థిని అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయంపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. అకౌంట్స్ సెక్షన్ లో పని చేసే కిందిస్థాయి ఉద్యోగితో పాటు మరో ఉద్యోగిపై ఫిర్యాదు చేసింది. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేసినట్లు సదరు విద్యార్థినీ ఉన్నతాధికారుల వద్ద కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. దీంతో ఇద్దరు ఉద్యోగులను పిలిచి అధికారులు విచారించగా.. ఆ విద్యార్థిని తమకు బంధువని అకౌంట్స్ సెక్షన్ ఉద్యోగి చెప్పాడు.

ఈ విషయం నిజమో కాదో.. తెలుసుకునేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల భార్యలను కూడా పిలిచి విచారించారు. ఉద్యోగులు అబద్ధం చెప్పారని ఉన్నతాధికారులకు నిర్దారణ అయ్యింది. ఈ ఘటనపై వన్ మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇవాళ ఈ కమిటీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉద్యోగుల సెల్ ఫోన్లు, ఆఫీస్ బీరువాలను ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. ఈ విషయంపై డైరెక్టర్ సతీశ్ ను వివరణ కోరగా.. స్టూడెంట్ ఇద్దరు ఉద్యోగులపై ఫిర్యాదు చేశారని, కమిటీ వేశామని చెప్పారు.