డిప్రెషన్‌‌తో బాధపడే వాళ్లని నవ్విస్తోన్న హరీష్ భువన్

డిప్రెషన్‌‌తో బాధపడే వాళ్లని నవ్విస్తోన్న హరీష్ భువన్

క్లినికల్ డిప్రెషన్‌‌తో బాధపడుతున్న హరీష్‌‌కు ఒకసారి క్లౌన్ (జోకర్​) వేషగాడు కనిపించాడు. అతడ్ని చూడగానే హరీష్ డిప్రెషన్ కాసేపు పక్కకుపోయి, ముఖం మీదకు చిరునవ్వొచ్చింది. వీధుల వెంట తిరుగుతూ అందర్నీ నవ్విస్తున్న ఆ క్లౌన్‌‌ని అలాగే చూస్తుండి పోయాడు. అప్పుడే అతనికి అర్థమైంది డిప్రెషన్‌‌కు మందు నవ్వులోనే ఉందని. అందుకే తను కూడా క్లౌన్‌‌గా మారాలనుకున్నాడు. క్లౌన్ రూపంలో వెళ్లి డిప్రెషన్‌‌తో బాధపడే వాళ్లని నవ్వించాలనుకున్నాడు. 

రంగురంగుల జుట్టు, ఎర్రటి ముక్కు, పెద్ద నవ్వుతో ఉండే క్లౌన్‌‌ను చూస్తే ఎవరికైనా వెంటనే నవ్వొస్తుంది. క్లౌన్ లేదా జోకర్ ఫేస్‌‌ చూడగానే పిల్లలు కూడా గంతులేస్తారు. అయితే క్లౌన్ ఫేస్..  కేవలం నవ్వించడమే కాదు. మనసుని హీల్ చేస్తుంది కూడా. ఇది గ్రహించిన హరీష్  ‘కంపాషనేట్ క్లౌన్స్’  పేరుతో  ఒక కౌన్సెలింగ్ సెంటర్‌‌ మొదలుపెట్టాడు. హాస్పిటల్స్‌‌కు వెళ్లి పేషెంట్ల మనసును తేలికపరుస్తున్నాడు.

డిప్రెషన్‌‌ను దాటి..

గుజరాత్‌‌లోని వడోదరలో పుట్టి పెరిగిన హరీష్ భువన్ పద్దెనిమిదేండ్ల వయసులో పైచదువుల కోసం బెంగళూరు వెళ్లాడు.  బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో బీఏ సైకాలజీ పూర్తిచేశాడు. ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి ‘టీచ్ ఫర్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత ఇబ్బందులు, అప్పుల కారణంగా హరీష్ ఐఐటీ ముంబైలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఆ టైంలోనే తను తీవ్రమైన డిప్రెషన్‌‌తో బాధపడ్డాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఒక క్లౌన్ ఫేస్ తనకెంతో హెల్ప్ అయింది. అప్పుడే  స్నేహితుడితో కలిసి బెంగళూరులో ‘కంపాషనేట్ క్లౌన్స్’ పేరుతో కౌన్సెలింగ్ సెంటర్ మొదలుపెట్టాడు. రకరకాల హాస్పిటల్స్ తిరుగుతూ పేషెంట్లలో పాజిటివిటీని పెంచుతున్నాడు.

పేషెంట్స్‌‌ హీల్ అయ్యేలా..

క్లౌనింగ్ సెషన్స్‌‌లో భాగంగా వీళ్లు రకరకాల హాస్పిటల్స్ తిరుగుతారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలు, పెద్దవాళ్ల దగ్గరకెళ్లి రకరకాల క్లౌనింగ్ పర్ఫార్మెన్స్‌‌లు ఇస్తారు. ఫన్నీ యాక్టివిటీస్‌‌ ఏర్పాటు చేస్తారు. సరదా ఆటలు ఆడిస్తారు. పిల్లలు ఆడే  ట్రైన్ ఆట లాగ టీం అంతా ఒకేసారి హాస్పిటల్‌‌లోకి ఎంట్రీ ఇస్తారు. పేషెంట్లను నవ్వించడం కోసం రకరకాల పాట్లు పడతారు. పేషెంట్లు తమకు తామే హీల్ అయ్యేలా వాళ్లలో ధైర్యాన్ని పెంచుతారు. పేషెంట్లతో ప్రేమగా ఉంటూ వాళ్లకు టైం తెలియకుండా సరదాగా గడిపేలా చేస్తారు. అలా వాళ్లలో త్వరగా కోలుకోవాలనే ఆశ పుడుతుంది. మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు ఇదెంతో ముఖ్యం.

ఎంతో కష్టపడాల్సి వచ్చింది

“నవ్వించడం అంత ఈజీ కాదు. దానికెంతో క్రియేటివిటీ కావాలి. క్లౌన్ వేషం వేసుకున్నంత మాత్రాన నవ్వు తెప్పించలేం. క్లౌనింగ్ అనేది ఒక ఆర్ట్‌‌. దాన్ని  అభ్యసించాలి. రకరకాల డాన్స్‌‌లు చేయడం, పాటలు పాడడం, శబ్దాలు చేయడం, ఎక్స్‌‌ప్రెషన్స్ వంటివి నేర్చుకోవాలి. మనదేశంలో క్లౌనింగ్ ఆర్ట్‌‌ నేర్పేవాళ్లు తక్కువ. అందుకే దీనికోసం నేనెంతగానో కష్టపడాల్సి వచ్చిందని’ అంటున్నాడు హరీష్​.

ఇద్దరితో మొదలై..

‘కంపాషనేట్ క్లౌన్స్’ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి నేను, నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక హాస్పిటల్‌‌కు వెళ్లాం. క్లౌన్ బట్టలు వేసుకుని, ముఖానికి రంగులు పూసుకుని హాస్పిటల్‌‌లోకి ఎంటర్ అయ్యాం. వింతగా డాన్స్ చేస్తూ, పాటలు పాడడం మొదలుపెట్టాం. మమ్మల్ని అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. కాసేపటికి హాస్పిటల్ అంతా సైలెంట్‌‌గా మారిపోయింది. అంతలో  ఒక పిల్లాడు కేరింతలు కొడుతూ పెద్దగా నవ్వాడు. ఆ తర్వాత పేషెంట్లు కూడా నవ్వడం మొదలుపెట్టారు. అలా రెండు నిమిషాల్లోనే హాస్పిటల్ అంతా సందడిగా మారింది. అలా ఇద్దరితో మొదలైన ఈ క్లౌన్ గ్రూప్ ఇప్పుడు ఐదువేలకు పెరిగింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది వలంటీర్లు క్లౌన్స్‌‌గా మారి మానసిక సమస్యలతో బాధపడుతున్నవారిని నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు” అని చెప్పాడు హరీష్ భువన్.