
- సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ పతనావస్థకు చేరుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. పురుగులు లేని భోజనం కోసం, పాము కాట్లు, ఎలుక కాట్లు లేని వసతి కోసం, కనీస సౌకర్యాల కల్పన కోసం తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. " ఓ వైపు టీచర్లు లేక బడులు మూతబడుతుంటే, మరోవైపు ప్రభుత్వ బడుల మీద విశ్వాసం సన్నగిల్లడంతో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1864 ఉంటే, 30 లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9,447 ఉన్నాయి. వందలోపు విద్యార్థులు మాత్రమే ఉన్న స్కూల్స్ 9,609 ఉన్నాయి.
అంటే 9 నెలల కాంగ్రెస్‌పాలనలో మొత్తం 26,287 ప్రభుత్వ పాఠశాలలకుగాను దాదాపు 20వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది" అని తన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.