24 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాలి.. పాక్ హైకమిషన్‌ ఉద్యోగికి భారత్ ఆదేశాలు

24 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాలి.. పాక్ హైకమిషన్‌ ఉద్యోగికి భారత్ ఆదేశాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న పాక్ హైకమిషన్‌ కార్యాలయంలోని పాక్ ఉద్యోగిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం ఆరోపించింది. వారం రోజుల వ్యవధిలోనే భారత్లోని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్లో ఇద్దరు పాక్ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం తొలగించడం గమనార్హం.

మే 13న కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఒక పాక్ ఉద్యోగిని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన రోజుల వ్యవధిలోనే ఇద్దరు పాక్ ఉద్యోగులను భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ALSO READ | ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా పోస్టు కేసులో.. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్కు సుప్రీం కోర్టు బెయిల్

పాకిస్తాన్‌‌కు స్పై ఏజెంట్గా పని చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పహల్గాం దాడి జరగడానికి 3 నెలల ముందే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి. పహల్గాం వెళ్లి అక్కడి వీడియోలు, ఫొటోలు తీసినట్లు తెలుస్తున్నది. ఆ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈమె ఇచ్చిన ఇన్​పుట్స్ ఆధారంగానే టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. పహల్గాం దాడికి ముందు ఆమె పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా వెళ్లొచ్చింది. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీఐవో) ఆమెను ఓ అసెట్గా డెవలప్ చేసుకున్నట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ హై కమిషన్లోని ఉద్యోగితో కూడా ఆమెకు సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.