ప్రభుత్వ దవాఖాన్లలో  టిఫా స్కానింగ్ 

ప్రభుత్వ దవాఖాన్లలో  టిఫా స్కానింగ్ 
  •     44 ఆస్పత్రుల్లో 56 మెషిన్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు 
  •     నెలకు 20 వేల మంది గర్భిణులకు సేవలందిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ దవాఖాన్లలో 56 టిఫా స్కానింగ్ మెషిన్లను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని తన ఇంటి నుంచి వర్చువల్‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గర్భిణులకు ఉచిత స్కానింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశామన్నారు. పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్భంలో ఉండగానే  గుర్తించేందుకు టిఫా (టార్గెటెడ్‌‌‌‌‌‌‌‌ ఇమేజింగ్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ ఫీటల్‌‌‌‌‌‌‌‌ అనామలీస్‌‌‌‌‌‌‌‌ స్కాన్‌‌‌‌‌‌‌‌) దోహదం చేస్తుందన్నారు.‘‘ ప్రైవేటులో టిఫా స్కాన్‌‌‌‌‌‌‌‌కు రూ.2 వేల నుంచి 3 వేల వరకు చార్జ్ చేస్తున్నారు. ఇకపై ఈ ఆర్థిక భారం పేదలకు పూర్తిగా తప్పుతుంది. ప్రతి నెల సగటున 20 వేల మంది గర్బిణులకు టిఫా సేవలు ఉచితంగా అందిస్తాం. గర్భిణులకు18 నుంచి 22 వారాల మధ్య ఈ స్కాన్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది.

నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని స్కాన్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఇందుకోసం కనీసం 20 నుంచి -30 నిమిషాలు పడుతుంది. రాష్ట్రంలో తల్లి, బిడ్డ క్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. గర్భిణులు పనికి వెళ్లొద్దని రూ.13 వేలు, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. అమ్మఒడి వాహనాలు సమకూర్చాం. సిజేరియన్ డెలివరీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని మంత్రి చెప్పారు. కాగా, టిఫా స్కానింగ్ మెషిన్ల ప్రారంభం కోసం హైదరాబాద్ పెట్లబుర్జులోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ ప్రారంభించిన హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నుంచే టిఫా స్కానింగ్ మెషిన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గర్భిణులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.