
మెదక్ జిల్లా కేంద్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై అవగాహన కార్యక్రమాన్ని రైతుబంధు సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ సదస్సులో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్ రెడ్డిలతో పాటు వ్యవసాయ కమిటీ అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీటీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని నియంత్రిత పద్దతిలో సాగు చెయ్యాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలో రెండు లక్షల అరవై వేల ఎకరాలలో పంటలు పండుతాయి. అన్ని ఎకరాలలో పంటమార్పు జరగాలంటే అవగాహన అవసరమని ఆయన అన్నారు. ‘మెదక్ జిల్లాలో 30 శాతం మక్కను యాసంగిలో వేసుకోవాలి. మొక్కజొన్నను స్వీట్ కార్న్, బేబి కార్న్, పశుగ్రాసం, దానగా ఉపయోగించే వారు పంటను వేసుకోవచ్చు. వానాకాలంలో కత్తెర తెగుళ్ళు వస్తుంది. దాంతో కంకులు బూజు పట్టి.. దిగుబడి తక్కువ వస్తుంది. కాబట్టి పంటమార్పిడి చేయాలి. గత వానాకాలం వరి పంటను లక్షా ఇరువై రెండు వేల ఎకరాలు వేసుకున్నాం. ఈసారి లక్ష ఇరువై మూడు వేలు వేసుకుందాం. దొడ్డు రకం పంటకు ధీటుగా సన్నరకం దిగుబడి వస్తుంది. సన్నరకం రేటు క్వింటాలుకు రూ. 2200 వస్తుంది. తెలంగాణ సోన సన్నరకం షుగర్ లెవెల్స్ తగ్గిస్తుందని సైంటిఫిక్ గా పరిశోధనలో తేలింది. కాబట్టి తెలంగాణ సోన రకం కూడా వేయాలి. మన రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాం. మొన్న యాసంగిలో ఒక్క గుంట కూడా ఎండలేదు. కరెంట్ హెచ్చుతగ్గుల వల్ల ఒక్క మోటార్ కూడా కాలలేదు. తెలంగాణా రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం రాష్ట్ర ఖజానా నుంచి సంవత్సరానికి 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 40 వేల ఎకరాలకు… అంటే 7 వేల కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాలలో వేస్తున్నాం. రైతుభీమాకు రూ. 1100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రుణమాఫీ కింద రూ. 6000 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇరిగేషన్ కింద రూ. 20 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తం రూ. 70 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ సీజన్ లో కందులు కొనడం వల్ల ప్రభుత్వానికి క్వింటాలుకు రూ. 3 వేలు నష్టం వచ్చింది. వ్యవసాయ రంగానికి ఇంత ఖర్చుపెట్టే ముఖ్యమంత్రి.. రైతులకు నష్టం రావాలని అనుకుంటాడా. రైతు లాభసాటిగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. గోదాములు పూర్తిగా నిండడం వల్ల మరో రెండు కోట్లతో గోదాములు కట్టడానికి శ్రీకారం చుట్టారు’ అని హరీష్ రావు అన్నారు.
For More News..