ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొడ్తవ్?

ప్రభుత్వాన్ని ఎందుకు కూలగొడ్తవ్?
  • పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకా?
  • ఈటలకు మంత్రి హరీశ్‌‌రావు ప్రశ్న
  • ఇచ్చిన మాట నిలబెట్టుకునే లీడర్ కేసీఆర్
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతం బందు పెట్టి.. రైతు బంధు ఇచ్చిండు

హుజురాబాద్, జమ్మికుంట, వెలుగు: ‘‘ప్రభుత్వాన్ని కూలదోస్తా అని ఈటల రాజేందర్ అంటున్నడు.. ఎందుకు కూలగొడతవ్? పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకా? రైతు బంధు, కల్యాణలక్ష్మి, దళిత బంధు వంటి పథకాలు పెట్టి ఆదుకుంటున్నందుకా?’’ అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కరీంనగర్‌‌‌‌ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేటలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌‌లో జరిగేవి నడుమంత్రపు ఎన్నికలని, రెండేళ్ల నాలుగు నెలల కోసం ఎన్నుకోబోతున్నామని హరీశ్​ చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడని చెప్పారు. కాళేశ్వరం నీళ్ల రాకతో మోటార్లు కాలుడు బాధ తగ్గిందన్నారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు జీతం బందు పెట్టి మరీ కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు. రైతు రుణ మాఫీ మొదట రూ. 25 వేల వరకు చేసిండు. ఈ మధ్యనే 50 వేల వరకు మాఫీ అయ్యింది. మిత్తితో సహా రూ.లక్ష రుణమాఫీ కోసం వచ్చే బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తం. 57 ఏళ్లు నిండిన వారికి రెండు మూడు నెలల్లో పెన్షన్ ఇస్తం. అభయహస్తం కింద మహిళలు కట్టిన పైసలు వడ్డీతో సహా త్వరలో ఇస్తం. ఈ డబ్బులు ఎల్ఐసీ నుంచి తెప్పించినం” అని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామని చెప్పి ఈటల ఓటు అడగాలని హరీశ్ సవాల్ చేశారు. సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్ను రూ.291గా ఉంటే జమ్మికుంట గాంధీ బొమ్మ కాడ ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని, లేదంటే ఈటల ఇంటికి పోతవా అని ప్రశ్నించారు. 

బీజేపీకి ఓటెందుకు వేయాలో చెప్పండి: బండి సంజయ్, కిషన్ రెడ్డికి హరీశ్ లేఖ
రైతులు టీఆర్ఎస్‌‌కు ఎందుకు ఓటు వేయాలో తాను వంద కారణాలు చెప్తానని, బీజేపీకి ఎందుకేయాలో ఒక్క కారణం చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వారికి 15 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు.‘‘రైతులను ఉగ్రవాదులతో పోల్చిన పార్టీ బీజేపీ. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే పాకిస్తాన్ అని ముద్ర వేయడం, రైతుల గురించి మాట్లాడితే ఖలిస్తాన్ అని ముద్ర వేయడం, న్యాయం గురించి మట్లాడితే హిందుస్తాన్ అని అరవడం బీజేపీ నాయకుల దుర్నీతి” అని మండిపడ్డారు. 

బైపోల్ తర్వాత కేసీఆరే సీఎం.. నేనే మంత్రి
అక్టోబర్ 30 తర్వాత కూడా రాష్ట్రానికి కేసీఆరే సీఎంగా ఉంటారని.. ప్రజలు, కేసీఆర్ ఆశీర్వాదంతో తాను మంత్రిగానే ఉంటానని హరీశ్​రావు అన్నారు. ఈటల గెలిచేది లేదు.. మంత్రి అయ్యేది లేదన్నారు. ఈటల తన స్వార్థం కోసమే బీజేపీలోకి వెళ్లాడని, ప్రజలందరికీ లాభం జరగాలంటే గెల్లు శ్రీనివాస్‌‌ గెలవాలన్నారు. 30న గ్యాస్​కు దండం పెట్టి, బీజేపీని బొందపెట్టి, కారు గుర్తుకు ఓటు కొట్టాలన్నారు. బొందపెడతా, కూలగొడతా, అంతు చూస్తా, గోరీకడతా అనడం తప్ప ప్రజలకు పనికొచ్చే మాట ఒక్కటీ కూడా ఈటల చెప్పట్లేదన్నారు. ‘‘బాయిల కాడ మీటర్లు పెడ్తరట. మార్కెట్లు పీకేస్తరట. దొడ్డు వడ్లు కొనరట. మరి బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి” అని ప్రశ్నించారు. రాజేందర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ‘ఎకరం భూమి అమ్ముతా.. ఎన్నికల్లో గెలుస్తా’ అని ఆయన అనడమే ఇందుకు నిదర్శనమన్నారు. జూటా పార్టీలో చేరిన ఈటలకు ఆ నీళ్లు బాగా వంటపట్టాయని, అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.