
- ఓ బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగినయ్
- మొత్తం ప్రాజెక్టే పోయినట్టు ప్రతిపక్షాల గోబెల్స్ ప్రచారం
- టీఎస్‌పీఎస్సీలో జరిగిన పొరపాటును ఒప్పుకుంటున్నం
- కమిషన్‌ను ప్రక్షాళన చేసినం.. పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తం
- నాకు సీఎం కావాలనే ఆశ లేదు.. ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు నష్టమేమీ జరగలేదని, ప్రతిపక్ష పార్టీలే కోడిగుడ్డుపై ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డనే కాదు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు. 2 పంప్ హౌస్‌లు, 19 రిజర్వాయర్లు, 204 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టన్నెల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 1,500 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్.. ఇలా ఒక పెద్ద వ్యవస్థ. ఈ విషయం తెలియక ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు హంగామా చేస్తున్నాయి” అని ఫైర్ అయ్యారు.
ఇంత పెద్ద మెగా ప్రాజెక్టులోని ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే, మొత్తం ప్రాజెక్టు పోయినట్టు వాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నరని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘పోయినసారి వరద వచ్చి పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతలు ఇలాగే మాట్లాడారు. అప్పుడు మేము చెప్పినట్టే సంబంధిత కాంట్రాక్టు సంస్థలు పంపులను రిపేర్ చేశాయి. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈసారి ఎల్ అండ్ టీ వాళ్లే, వాళ్ల ఖర్చుతో మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేస్తారు. యాసంగికి నీళ్లు కూడా ఇస్తాం” అని హరీశ్ వివరించారు.
కేసీఆర్ వల్లే ముందున్నం
కేసీఆర్ ఉన్నారు కాబట్టే.. మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు స్థానంలో ఉందని హరీశ్ చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. కేంద్రం ఇచ్చే అన్ని అవార్డుల్లోనూ తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. ‘‘మేనిఫెస్టోలో పెట్టకపోయినా రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి స్కీమ్‌లు పెట్టి లక్షల మందికి సాయం చేశాం. కేసీఆర్ హయాంలో పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తున్నారు. పల్లెలు కూడా అభివృద్ధి జరగడం వల్లే ఇది సాధ్యమైంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కరెంట్ సమస్య ఉంది.
తెలంగాణలో మాత్రం పల్లెల్లో కూడా కరెంట్ సమస్య లేదు. ఒక్క గుంట భూమి కూడా ఎండకుండా నీళ్లు ఇస్తున్నాం. పెండింగ్ ప్రాజెక్టులను, రన్నింగ్ ప్రాజెక్టులుగా మా ప్రభుత్వం మార్చింది. అందువల్లే పాలమూరు నుంచి వలస వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారు” అని తెలిపారు. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు కట్టి నీటి సమస్య లేకుండా చేశామన్నారు. వైద్య రంగంలో దేశంలో మూడో స్థానానికి రాష్ట్రం వచ్చిందన్నారు. గతంలో ఇతర దేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చదువుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు జిల్లాకో కాలేజీ పెట్టి ఇక్కడే చదువుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు.
కర్నాటక నుంచి లిక్కర్, డబ్బులు ఇక్కడికి వస్తున్నాయని, ఇదే సమయంలో కర్నాటకకు మన బియ్యం ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తమ జీవితాల్లో వచ్చిన మార్పులను గుండె మీద చేయి వేసుకుని ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
3 శాతం మందికే ఉద్యోగాలు ఇవ్వగలం
దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా జనాభాలో 2.5 నుంచి 3.5 శాతం మందికే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయని హరీశ్ రావు చెప్పారు. ‘‘మన ఉద్యోగాలు మనకు దక్కాలన్నదే ఉద్యమ నినాదం. ఆ మేరకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో సవరణ చేసి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశాం. తొలి టర్మ్‌లో 1.32 లక్షల ఉద్యోగాలు నింపినం. ఈసారి 80 వేల ఖాళీలు నింపాలని భావించినప్పటికీ, కరోనా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో సవరణల వల్ల ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ పదేండ్లలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రైవేటులో 24 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.
భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ పెట్టి ఉద్యోగాల భర్తీ చేపడుతాం” అని తెలిపారు. దురదృష్టవశాత్తు ఒక ఎగ్జామ్‌లో పేపర్ లీక్ అయిందని, దాన్ని ప్రభుత్వమే గుర్తించి సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించిందని, అందరినీ అరెస్ట్ చేశామని చెప్పారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని, తిరిగి పకడ్బందీగా ఆ ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తామని వివరించారు. జరిగిన పొరపాటును తాము ఒప్పుకుంటున్నామని, తప్పును కప్పిపుచ్చుకునే ఉద్దేశం తమకు లేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కర్నాటకలో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ చెప్పారని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు.
కొంత వ్యతిరేకత సహజమే
తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని హరీశ్ అన్నారు. తనకు పార్టీ ఏ రోల్ ఇస్తే, ఆ రోల్ మాత్రమే పోషిస్తానని చెప్పారు. ‘‘రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కొంత వ్యతిరేకత ఉండడం సహజమే. నేను చేపట్టిన శాఖల్లో.. హెల్త్ నాకు ఇష్టమైన సబ్జెక్టు. ఆరోగ్యశాఖలో పనిచేయడంలో ఆత్మసంతృప్తి ఉంది. ప్రజలకు సేవ చేసే అవకాశం అందులో ఎక్కువగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.
పాజిటివ్ ఓటుతో మళ్లీ పవర్‌లోకి వస్తం
ఐటీ రంగంలో బెంగళూరును దాటి నంబర్ వన్‌గా హైదరాబాద్ మారిందని హరీశ్ రావు చెప్పారు. హైదరాబాద్‌కు నార్త్ ఇండియన్స్ వచ్చి సెటిల్ అవుతున్నారని, కరువు, కర్ఫ్యూ లేదు కాబట్టే ఇక్కడకు వస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమం చేరిందని, పాజిటివ్ ఓటుతో మళ్లీ పవర్‌లోకి వచ్చి రికార్డ్ క్రియేట్ చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న ప్రచారంలో నిజం లేదని హరీశ్ అన్నారు. మైనార్టీల ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ తరహా ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటైతే గవర్నర్ తమకు ఎందుకు సహకరించడం లేదో కాంగ్రెస్ చెప్పాలని ప్రశ్నించారు.
ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలపడంలో గవర్నర్ తమకు సహకరించలేదని, ఆమె ఆలస్యం చేయడం వల్లే విలీన ప్రక్రియ ఆలస్యమైందన్నారు. కేబినెట్ ఇచ్చిన ఎమ్మెల్సీల రికమండేషన్‌ను కూడా గవర్నర్ తిరస్కరించారని చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని హరీశ్ ఆరోపించారు. మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ సహకరించిందని, ఇప్పుడు కాంగ్రెస్‌కు బీజేపీ సహకరిస్తున్నదని అన్నారు.