ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి హరీశ్ రావు

ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని మాజీ మంత్రి  హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సోమవారం ఎక్స్​లో పోస్ట్ చేశారు. 

నాలుగు నెలల్లోనే సన్నబియ్యం ధరలు 25 శాతం పెరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గాలి కానీ, రేట్లు ఆకాశాన్ని ఎందుకు తాకుతున్నాయో చెప్పాలన్నారు. రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడం వల్లే ప్రజలు బయట మార్కెట్లో కొనాల్సి వస్తోందని విమర్శించారు.

రైతుకు గోరంత.. దళారులకు కొండంత..

రైతులకు నామమాత్రపు రేటు దక్కుతుంటే.. మధ్యవర్తులు, దళారులు క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు ఏకంగా రూ.8 వేలకు పైగా దండుకుంటున్నారని విమర్శించారు. రైతుకు గిట్టుబాటు ధర లేక, వినియోగదారుడికి అందుబాటు ధర లేక మధ్యవర్తులు భారీగా లాభపడుతుంటే ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కొడంగల్ తీసుకెళ్లిన్రు

సిద్దిపేట రూరల్: తమ హయాంలో సిద్దిపేటకు మంజూరు చేసిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి దొంగలా కొడంగల్ కు తరలించుకుపోయారని హరీశ్ రావు విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కాలేజీని తిరిగి సిద్దిపేటకు తీసుకొస్తామని చెప్పారు. సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా పదేండ్ల పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. సిద్దిపేట ప్రజల కల అయిన గోదావరి జలాలు, రైలు ఇక్కడికి వచ్చాయని, సిద్దిపేటలో అన్నీ విద్యాలయాలు నెలకొల్పామని చెప్పారు. 11న పట్టణంలో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.