వనపర్తి, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి వనపర్తికి నీళ్లు పారుతాయని, గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ అవసరం లేదని ఆనాడే చెప్పామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మొదట ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రతిపాదించినప్పటికీ ఏదుల నుంచి నీళ్లు పారే అవకాశం ఉండడంతో 2018లో ప్రాజెక్టు నిర్మాణాన్ని రిజెక్ట్ చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఈ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తోందని విమర్శించారు.
గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం వద్దంటూ బాధితులు చేస్తున్న వంద రోజుల దీక్షను హరీశ్‌రావు గురువారం విరమింపజేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 60 ఏండల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25 రిజర్వాయర్లు కడితే, తమ బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేండ్లలోనే 65 టీఎంసీల నీళ్లు నిలువచేసే రిజర్వాయర్లను నిర్మించామని గుర్తుచేశారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధానమైన పనులు తామే పూర్తి చేశామని, మిగిలిపోయిన చిన్న, చిన్న పనులను పూర్తి చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. మూడు సీజన్లు పోయిన 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండేదని, అన్ని నీళ్లు మన రిజర్వాయర్లలో ఉంటే పాలమూరు ఎట్లుండేదో గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో కనీసం 10 వేల ఎకరాలకైనా నీళ్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. నాలుగు రైతుభరోసాలు ఎగ్గొట్టారని విమర్శించారు. వనపర్తిలో ఏ ఉరికైనా వెళ్దామని, రుణమాఫీ 100 శాతం పూర్తయిందని ఎవరైనా చెబితే తాను వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వట్టెంలో పంపులు మునిగిపోతే ఒక్కసారి కూడా అటువైపు చూడలేదన్నారు. కాంట్రాక్టర్లను బతికించడానికి గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామంటున్నారని విమర్శించారు. సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
