పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఉగాది పండగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు. ఇందుకు దర్శకుడిని బాధ్యుడిని చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొన్ని సన్నివేశాలను ప్రస్తావిస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఎంట్రీ సీన్‌పై వీపరీతంగా ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆట ఆడేసుకుంటున్నారు.
హీరో పవన్ కళ్యాణ్ రెండు సార్లు జీప్ లో నుంచి దిగినట్లు చూపించారు. రౌడీని కొట్టి ఆల్రెడీ జీపు దిగిన హీరో.. మళ్లీ లోపల నుంచి జంప్ చేసినట్లు ఎలా చూపించారు. ఒకే సీన్లో ఇలా చూపించడంపై విమర్శలు చేస్తూ అలా ఎలా ఇలాంటి లాజిక్స్ మిస్అయ్యారని ట్వీట్స్ పెడుతున్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) స్పందిస్తూ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. తనకు రెండు ఎంట్రీలు నచ్చాయని, అందుకే ఆ సీన్ అలా పెట్టినట్టు చెప్పాడు. అయితే, నచ్చితే లాజిక్స్ ఏ మాత్రం పట్టించుకోనని అన్నాడు.
‘‘తాను కొన్ని సన్నివేశాల్లో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుంటానని తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఒక సీన్ ఉదాహరణగా చెప్పారు. అందులో పవన్ కళ్యాణ్ జీప్ నుంచి దిగే సన్నివేశాన్ని రెండు విధాలుగా చూపించానని వెల్లడించారు. ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ ఫస్ట్ జీప్‌లో నుంచి దిగుతారు. ఆ సమయంలో ఒక బాడీ పడుతుంటే ఆయన దిగడం చూపించా. ఆ తర్వాత మళ్లీ జీప్ నుంచి జంప్ చేస్తూ కిందకు వస్తారు. ఇదేంటి రెండుసార్లు ఎలా దిగారని కొందరు అన్నారు. అయితే, ఈ రెండు షాట్లు లాజిక్‌కు సరిపోకపోయినా, రెండూ బాగా వచ్చాయని భావించి ఫైనల్ కట్‌లో ఉంచినట్టు చెప్పారు. మొత్తానికి “నాకు నచ్చితే లాజిక్‌ను పట్టించుకోను” అని హరీష్ స్పష్టం చేశారు.
తన కెరీర్ గురించి మాట్లాడిన ఆయన, ఇప్పటివరకు తక్కువ సినిమాలే చేసినట్టు తెలిపారు. తొమ్మిది సినిమాలు తెరకెక్కించినప్పటికీ, దాదాపు పది ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. స్క్రిప్ట్ సమస్యలు, హీరోల మార్పులు వంటి కారణాలతో అనేక ప్రాజెక్టులు పూర్తి కాలేదని వివరించారు.
అంతేకాక, Jr. ఎన్టీఆర్‌తో ‘MLA’ అనే ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ అది కూడా కుదర్లేదని తెలిపారు. క్యాన్సిల్ అయిన ప్రాజెక్టులపై ఎంతో కృషి చేసినప్పటికీ, వాటిని సెట్స్ మీదకు తీసుకురాలేకపోయానని అన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడతానని, ఇప్పటికే చాలా కథలు సిద్ధంగా ఉన్నాయని, వరుసగా సినిమాలు తెరకెక్కిస్తానని హరీష్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పొరపాటు అనుకున్నా … కాదు తప్పు pic.twitter.com/lBL8I9QqCQ
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) March 26, 2026
