కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో పక్కదారిన హరితహారం కార్యక్రమం

కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో పక్కదారిన హరితహారం కార్యక్రమం
  • నాటిన మొక్కలు తక్కువ.. రికార్డుల్లో మాత్రం ఎక్కువ
  •  కొందరు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల నిర్వాహకం
  •  ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడుతున్న తతంగం! 

ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం మెదక్​ జిల్లాలో కొందరు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పక్కదారి పడుతోంది. తక్కువ మొక్కలు నాటి ఎక్కువ నాటినట్లు చూపుతూ రిపోర్టులు సమర్పించి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా, ప్రజాధనం వృథా అవుతోంది.  ఇటీవల తనిఖీల్లో సంఖ్యకు తగిన మొక్కలు కనిపించకపోవడంతో తప్పుడు లెక్కల తతంగం బయటపడింది. 

మెదక్​(శివ్వంపేట), వెలుగు : ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా మెదక్​ జిల్లా వ్యాప్తంగా 34 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా గ్రామ నర్సరీలతోపాటు, ఫారెస్ట్​ డిపార్ట్​ మెంట్​ ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలు సిద్ధం చేశారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకుగాను డిపార్ట్​మెంట్ల వారీగా టార్గెట్​లు కేటాయించారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో సమృద్ధిగా వర్షాలు పడటంతో అన్నిమండలాల్లోని ఖాళీ ప్రదేశాల్లో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే పర్యవేక్షణ లేక పోవడంతో పలు చోట్ల మొక్కుబడిగా మొక్కలు నాటి ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోలేదు. కొన్ని చోట్ల పంపిణీ చేసిన మొక్కలు నాటకుండానే పడేసి, అన్నీ నాటినట్టు పై ఆఫీసర్లకు రిపోర్ట్​ ఇచ్చినట్టు తెలిసింది. టార్గెట్​ మేరకు మొక్కలు నాటకుంటే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పడంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. 

తాళ్లపల్లిగడ్డ తండాలో వెలుగులోకి... 

శివ్వంపేట మండలం తాళ్లపల్లిగడ్డ తండాలో మంగళవారం ఎంపీడీవో తనిఖీ నిర్వహించగా కేవలం 1,500 మొక్కలు నాటి 6 వేల మొక్కలు నాటినట్టు తప్పుడు నివేదిక ఇచ్చిన విషయం వెలుగు చూసింది. దీన్ని బట్టి వేల సంఖ్యలో మొక్కలు నాటకుండానే నాటినట్టు అధికారులను తప్పుదోవపట్టించినట్టు అర్థమవుతోంది. చాలా వరకు మొక్కలను నాటకుండా వృథా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనతో సంబంధిత అధికారులు మిగతా చోట్ల హరితహారం మొక్కలపై ప్రత్యేక దృష్టి సారించారు. శివ్వంపేట మండల వ్యాప్తంగా ఎనిమిదో విడుత హరితహారంలో లక్షా 87 వేల మొక్కలు నాటగా,  రోజూ రెండు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం ఎంపీడీవో నవీన్​కుమార్, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో అనిల్​ మండలంలోని ఉసిరికపల్లి, మగ్దుంపూర్ లో తనిఖీలు చేశారు. శివ్వంపేట మండలంతోపాటు అధికారులు అన్ని చోట్ల పక్కాగా తనిఖీలు నిర్వహిస్తే చాలా ప్రాంతాల్లో హరితహారం మొక్కలు నాటే విషయంలో జరిగిన అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.