నల్గొండలో కలెక్టర్​, ఆఫీసర్ల నడుమ మొక్కల పంచాయితీ

నల్గొండలో కలెక్టర్​, ఆఫీసర్ల నడుమ మొక్కల పంచాయితీ
  • జిల్లాకు 56.12 లక్షల మొక్కల టార్గెట్​ 
  • జాగలు లేవంటున్న అధికారులు
  • ఎందుకు దొరకదంటున్న కలెక్టర్ 
  • గుంతలు తవ్వడంలో  వెనకబడ్డ ఆఫీసర్లు, సిబ్బంది 
  • ఇప్పటికే డీఆర్​డీఏ, ఎంపీడీవోలు, ఏపీవోలకు నోటీసులు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో హరితహారం కార్యక్రమం అధికారుల మధ్య చిచ్చు రాజేసింది. కొత్తగా వచ్చిన కలెక్టర్​ఆర్​వి కర్ణన్​ హరితహారం ప్రోగ్రాంను సీరియస్​గా తీసుకోవడంతో అధికారులు టెన్షన్​పడుతున్నారు. గత వారం, పది రోజుల నుంచి హరితహారం గురించే ప్రతిరోజు రివ్యూ నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఇచ్చిన టార్గెట్​ మేరకు గ్రామాల వారీగా ఎన్ని గుంతలు తవ్వారు? ఇంకా ఎన్ని గుంతలు తవ్వాల్సి ఉంది? గుంతలు తవ్వడంలో వెనకబడ్డ మండలాలు ఎన్ని ఉన్నాయి? అనే అంశాలపై కలెక్టర్  రోజూ రిపోర్ట్​తెప్పించుకుని రివ్యూ చేస్తున్నారు. అయితే, హరితహారం మొక్కలు నాటేందుకు గ్రామాల్లో జాగ లేదని ఫీల్డ్​ స్టాఫ్​ చెబుతున్నారు. ఎక్కడ నాటాలో తేల్చుకోవడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది పది రోజులుగా శ్రమిస్తున్నారు. సెలవుల్లోనూ డీఆర్డీఏ స్టాఫ్​   హరితహారం కోసం పని చేస్తున్నామని చెబుతున్నారు.  

జిల్లాలో ఈసారి లక్ష్యం 56.12 లక్షలు..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తొమ్మిదో విడత హరితహారం అమలవుతోంది. 8 విడతల్లో ప్రతి ఏడాది లక్షల్లో మొక్కలు నాటాలని సర్కారు టార్గెట్​ పెడుతోంది. అయితే ఏటికేడు ఈ టార్గెట్​ పెరిగిపోతోంది. మొదటి విడతలో ప్రతి గ్రామంలో 15 వేల వరకు మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించింది. తర్వాత నుంచి క్రమక్రమంగా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇరిగేషన్ ల్యాండ్స్​లో మొక్కలు నాటేలా యాక్షన్​ ప్లాన్​ మార్చారు. నల్గొండ జిల్లాలో రెండు, మూడు విడతల నుంచి రోడ్లు, ఇరిగేషన్ ల్యాండ్స్​ పైనే కలెక్టర్లు దృష్టి పెట్టారు. అక్కడ కూడా స్థలం సమస్యగా మారడంతో కోతుల వనాల పేరిట రోడ్ల వెంట మొక్కలు నాటారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మళ్లీ గ్రామాల్లోనే మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందు కోసం అన్ని డిపార్ట్​మెంట్లకు  56.12 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్​ పెట్టారు. 

నోటీసుల మీద నోటీసులు

కలెక్టర్ ​జిల్లాకు వచ్చిన రెండు రోజులకే హరితహారం విషయంలో డీఆర్డీఏ పనితీరు సరిగ్గా లేదని షోకాజ్ ​నోటీసు ఇచ్చారు. జిల్లా అధికారికి నోటీసులు ఇస్తే కింది స్టాఫ్​ భయపడి పనిచేస్తారని ఆయన భావించి ఉంటారని పలువురు ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. అయితే, జిల్లాలోని 23 మండలాల్లో సిబ్బంది, అధికారులు గుంతల తవ్వడంలో వెనకబడ్డారు. ఇది గమనించిన కలెక్టర్​ పనితీరులో మరింత వెనకబడిన ఏడు మండలాల ఎంపీడీఓలకు శనివారం కలెక్టర్ షోకాజ్​ నోటీసులిచ్చారు. అంతకుముందు ఐదుగురు ఏపీఓలకు నోటీసులిచ్చినప్పటికీ పనితీరు మారకపోవడంతో కలెక్టర్, అడిషనల్ ​కలెక్టర్​ రోజు తప్పించి రోజు సెల్​కాన్ఫరెన్స్​, వీడియో కాన్ఫరెన్స్​లు నిర్వహిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకోవైపు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో ఆగస్టు 15న 8.50 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్​ పెట్టారు. దీనికి తవ్వాల్సిన గుంతలు కూడా ఇంకా పూర్తికాలేదు. అయితే, హరితహారం కోసం తవ్విన గుంతల్లో మొక్కలు నాటితే సరిపోతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, దీని కోసం ప్రత్యేకంగా మరో 8 లక్షల గుంతలు తవ్వాలని టార్గెట్​ పెట్టారు. ఇప్పటి వరకు 2.53 లక్షల గుంతలు మాత్రమే తవ్వడంతో కలెక్టర్​ మరింత సీరియస్​ అయినట్టు సమాచారం.  

లక్ష్యం సరే గుంతల సంగతేంది? 

నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లక్ష్యం 19.05లక్షలు కాగా, 17,23,114 గుంతలు మాత్రమే తవ్వేందుకు ఎస్టిమేషన్ ​ప్రిపేర్​ చేశారు. ఇప్పటివరకు 11,08,321 గుంతలే తవ్వారు. ఇంకా 6,14,793 గుంతలు తవ్వాల్సి ఉంది. అయితే పై అధికారుల ఒత్తిడి మేరకు జిల్లా స్థాయిలో ప్రిపేర్​ చేసిన ఎస్టిమేషన్ల ప్రకారం గుంతలు తవ్వాలంటే ఊళ్లలో జాగలేదని ఫీల్డ్​ స్టాఫ్​ చెబుతున్నారు. అయితే, ఖాళీ జాగలు ఎందుకు లేవని, ఎక్కడెక్కడున్నాయో చూస్కొని నాటాలని కలెక్టర్​ చెబుతున్నారు. పైగా ప్రతి రోజు గుంతల తవ్వకానికి సంబంధించిన ప్రోగ్రెస్​పై రివ్యూ చేస్తున్నారు. దీంతో డీఆర్డీఓతో సహా, ఎంపీడీవోలు, ఏపీవోలు భయపడిపోతున్నారు. 

ఇరిగేషన్ ​భూముల్లో రైతులు తిరగబడ్తున్నరు..

ఆదాయాన్ని తెచ్చే మొక్కలను ఎకరం, అరెకరం స్థలాల్లో నాటాలని ఈ ఏడాది కొత్త యాక్షన్​ ప్లాన్​ తయారు చేశారు. దీనికి ఇరిగేషన్​ భూములు ఎంపిక చేశారు. 
జిల్లాలో 74 ఎకరాల్లో సంపద వనాలు పెంచేందుకు స్థలాలు గుర్తించారు. కానీ, దీంట్లో 80 శాతం భూములు రైతుల ఆధీనంలో ఉన్నాయి. నాగార్జునసాగర్, ఎస్ఎల్బీసీ, కాల్వల పరిధిలోని ఖాళీగా ఉన్న ఇరిగేషన్ భూముల్లో రైతులు వరి, పత్తి సాగు చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని కింది స్థాయి సిబ్బంది జిల్లా అధికారులకు చేరవేశారు. అయితే, వారు రైతుల నుంచి భూములు లాక్కోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ పంచాయితీ స్థానిక ఎమ్మెల్యేల వరకు వెళ్లింది. దీంతో వారు రైతుల జోలికి రావొద్దని అధికారులను హెచ్చరించినట్టు సమాచారం. కానీ, ఇవేమీ ప ట్టించుకోని కలెక్టర్ మాత్రం సంపద వనాలు ఎస్టిమేట్లు వేయాల్సిందేనని ఆదేశాలిచ్చారు. కానీ, భూములు ఖాళీ లేకపోవడంతో ఇప్పటి వరకు 15 ఎస్టిమేట్లు మాత్రమే కంప్లీట్​ 
చేయగా, 6.5 ఎకరాల్లో మాత్రమే బ్లాక్​ప్లాంటేష న్​ (గంప గుత్తగా ఒకే చోట నాటడం) చేయగలిగారు.