IPL 2024: కేకేఆర్‌కు బిగ్ షాక్..చెన్నైతో మ్యాచ్‌కు యువ సంచలనం దూరం

IPL 2024: కేకేఆర్‌కు బిగ్ షాక్..చెన్నైతో మ్యాచ్‌కు యువ సంచలనం దూరం

ఐపీఎల్ లో వరుస విజయాలు సాధిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు యువ బౌలర్ హ‌ర్షిత్ రాణా గాయ‌ప‌డ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్ లో హర్షిత్ రానా ఫీల్డింగ్ చేస్తుండగా అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్ లో అతను ఒక్క ఓవర్ కూడా వేయలేదు. ఆరో ఓవర్ వేయాలని భావించినా.. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఒక్క బంతి కూడా వేయకుండా మైదానాన్ని విడిచిపెట్టాడు. ఆ తర్వాత డగౌట్ లో భుజంపై ఐస్ ప్యాక్ చేస్తూ కనిపించాడు. 

మధ్యలో ఫీల్డింగ్ చేయడానికి మళ్ళీ గ్రౌండ్ లోకి రాలేదు. మ్యాచ్ అనంత‌రం అత‌డిని స్కానింగ్ త‌ర‌లించిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని గాయం నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. గాయం నుంచి కోలుకోకుంటే ఏప్రిల్ 8 న చెన్నై సూపర్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్ కు రానా దూరం కానున్నాడు.ఇప్పటివరకు మూడు మ్యాచ్ లాడిన రానా రెండు మ్యాచ్ ల్లో బౌలింగ్ చేసి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రానా చివరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 

చివరి 5 బంతులకు 7 పరుగులు చేయాల్సిన దశలో ఊపు మీదున్న హైదరాబాద్ బ్యాటర్లను తన సూపర్ బౌలింగ్ తో కేకేఆర్ కు విజయాన్ని అందించాడు. రూ.20 లక్షల రూపాయలకు కేకేఆర్ ఇతన్ని కొనుక్కుంది. 24.75 కోట్లు వెచ్చించిన స్టార్క్ కంటే రానా బాగా బౌలింగ్ చేస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కోల్ కతా ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.