
అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ విదేశీ విద్యార్థులకు వరుస షాకులు ఇస్తున్నారు.ఇప్పటికే స్టూడెంట్ వీసాలపై కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ తాజాగా విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని రద్దు చేసింది అమెరికా ప్రభుత్వం. బుధవారం ( జూన్ 4 ) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది వైట్ హౌస్. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ప్రభుత్వం. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయంతో హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్ హౌస్ కి మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులకు సంబందించిన సమాచారాన్ని సరిగా నివేదించటం లేదని పేర్కొంది ప్రభుత్వం. ముగ్గురు విద్యార్థులకి సంబందించిన సమాచారంలో లోపాలు ఉన్నట్లు పేర్కొంది ప్రభుత్వం. విదేశీ విద్యార్థుల సమాచారం విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీ తీరును తీవ్రంగా వ్యతిరేకించింది ప్రభుత్వం. హార్వర్డ్ తీరుతో దేశ భద్రతకు ముప్పు ఉంటుందని పేర్కొంది ట్రంప్ సర్కార్.
ఇదిలా ఉండగా.. వారం రోజుల కిందట స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అన్ని దేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కౌన్సిలర్ సెక్షన్లకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ఇచ్చింది. ‘సోషల్ మీడియా వెట్టింగ్’ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై అగ్రరాజ్యం నిఘా పెట్టింది. అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో ఆ దేశ వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతున్నది.
►ALSO READ | అమెరికాలోకి డేంజర్ ఫంగస్ రవాణా..ఇద్దరు చైనా రీసెర్చర్ల అరెస్టు
ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ‘సోషల్ మీడియా వెట్టింగ్’ నిర్ణయం తీసుకున్నది. అప్లికెంట్ అందజేసే సోషల్ మీడియా అకౌంట్లను అధికారులు పరిశీలిస్తారు. అమెరికాను వ్యతిరేకిస్తూ ఏమైనా పోస్టులు ఉంటే.. వెంటనే అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారికి స్టూడెంట్ వీసాలభిస్తుంది.